ఈరోజుల్లో సినిమా తీయడం ఒక ఎత్తు. దాన్ని జనంలోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ప్రమోషన్లు సినిమా విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాగని ఈవెంట్లు చేసి డబ్బులు వెదజల్లడంలో లాభం లేదు. ఏదో ఒకటి ఇన్నోవేటివ్ గా చేయాలి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కోసం అనిల్ రావిపూడి అదే చేశాడు. పైసా ఖర్చు లేకుండా బోలెడంత ప్రమోషన్ తీసుకొచ్చాడు. హీరోతో పాటు టీమ్ అందర్నీ తెలివిగా వాడేసుకొన్నాడు. ఇప్పుడు అదే బాటలో `రాబిన్ వుడ్` నడుస్తోంది.
నితిన్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. ఈనెలాఖరున విడుదల అవుతోంది. ఈ సినిమాకి బజ్ విషయంలో కొరత వుంది. ఆ లోటు పూడ్చడానికి చిత్రబృందం రెడీ అయ్యింది. కొత్త తరహా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టబోతోంది. కొన్ని ప్రమోషన్ వీడియోలు రెడీ చేసే పనిలో పడింది. అందులో భాగంగా ఈరోజు నితిన్ – వెంకీ కుడుములతో ఓ వీడియో షూట్ చేసి వదలింది. నితిన్ పడుకొన్నా – పళ్లు తోముకొంటున్నా వదలకుండా, పట్టువదలని విక్రమార్కుడిలా వెంట పడుతున్నాడు వెంకీ కుడుముల. ప్రమోషన్స్ కోసం. దర్శకుడి బాధ భరించలేక.. ‘ప్రమోషన్లకు వస్తున్నా’ అని నితిన్ అభయహస్తం ఇచ్చేశాడు. ఇక నుంచి ప్రమోషన్ల వేట షురూ అన్నట్టు తీర్చిదిద్దారు ఈ ఫన్నీ వీడియోని.
ఇలాంటి కాన్సెప్ట్ వీడియోలు కొన్ని షూట్ చేసి పెట్టుకొంది చిత్రబృందం. వీలు చూసుకొని ఒకొక్కటీ వదులుతారు. ఈ సినిమా కోసం కేతిక శర్మతో ఓ ఐటెమ్ పాట చేశారు. ఆ పాట చాలా హాట్ హాట్ గా ఉంటుందని టాక్. అంతే కాదు… ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడైనా సరే, డేవిడ్ తెలుగువాళ్లందరికీ చిర పరిచితుడే. అతని పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని టాక్. డేవిడ్ ని కూడా ప్రమోషన్ల కోసం తీసుకొస్తే ఆశ్చర్చపోవాల్సిన పనిలేదు.
ROBINHOOD kicks off interesting promotions featuring Nithiin & Director Venky pic.twitter.com/FhQPzV3pt4
— Telugu360 (@Telugu360) March 7, 2025