ఈనెలలో ‘పుష్ప 2’కి మించిన పెద్ద సినిమా లేదు. 20న రావాల్సిన ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి వెళ్లిపోయింది. కాబట్టి ‘పుష్ప 2’కి అడ్డులేదు. కానీ క్రిస్మస్ సందర్భంగా ‘రాబిన్‌వుడ్’ విడుదల చేద్దామనుకొన్నారు. ఇప్పుడు ఈ సినిమాని వాయిదా వేయాలా, వద్దా? అని తర్జనభర్జనలు పడుతున్నారు. ఎందుకంటే ఈ రెండు చిత్రాలూ మైత్రీ మూవీస్ వే. ‘పుష్ప 2’ ఇంకా థియేటర్లో ఉంది కాబట్టి, తమ బ్యానర్ నుంచే మరో సినిమా విడుదల చేయడం ఎందుకు? అనేది వాళ్ల ఆలోచన.
‘పుష్ప 2’ ఆల్రెడీ రెండో వారంలో ఎంటర్ అయ్యింది. ఇప్పటికీ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ వీకెండ్ లో కూడా పుష్పరాజ్‌దే హవా. ఇదే జోరు క్రిస్మస్ వరకూ కొనసాగాలని మైత్రీమూవీస్ కోరుకుంటుంది. నిజంగా ‘పుష్ప 2’ అప్పటి వరకూ నిలదొక్కుకోగలిగితే అది పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. క్రిస్మస్ సెలవుల్ని కూడా క్యాష్ చేసుకోవొచ్చు. అయితే అప్పటి వరకూ వసూళ్లు ఉంటాయా, ఉండవా? ఒకవేళ లేకపోతే థియేటర్లకు రెంట్లు కట్టుకొని మరీ… సినిమాని నడిపించాల్సిన పరిస్థితి వస్తుంది. `రాబిన్‌వుడ్` ఇప్పుడు వాయిదా పడితే మరో మంచి డేట్ దొరుకుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. అందుకే నితిన్ కూడా ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ క్రిస్మస్కి విడుదల చేయాల్సిందే అని పట్టుబడుతున్నాడట. కావాలంటే నైజాం హక్కుల్ని తాను తీసుకొంటానని ఆఫర్ ఇస్తున్నాడట. ఎందుకంటే నితిన్‌కి ఈ సినిమా చాలా కీలకం. వరుస ఫ్లాపుల తరవాత మళ్లీ ట్రాక్ లోకి రావాలంటే కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి తరుణంలో ఈ సీజన్‌ని మిస్ అవ్వడం తనకు ఇష్టం లేదు. ఈవిషయంలో మైత్రీ మూవీస్ ఇప్పుడు తర్జనభర్జనలు పడుతోంది. ఒకవేళ ఈ వారాంతంలోనూ ‘పుష్ప 2’ వసూళ్ల జోరు ఆగకపోతే… బన్నీ కోసం నితిన్ సైడ్ ఇవ్వాల్సిందే.