నితిన్ పయనం ఇప్పుడు తిరోగమన దశలో ఉంది. ఈమధ్య వరుస ఫ్లాపులతో అల్లాడిపోయాడు. ఎన్నో ఆశలు పెట్టుకొన్న `రాబిన్ హుడ్` కూడా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు తన కెరీర్ అంతా `తమ్ముడు`పై ఆధారపడి వుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ఏప్రిల్ లో విడుదల చేద్దామనుకొన్నారు. ఇప్పుడు జులై 4కి షిఫ్ట్ అయ్యింది. జులై 4 అంటే… వేసవి సీజన్ వదులుకొన్నట్టే.
నిజానికి తమ్ముడు సినిమా ఇది వరకే విడుదల కావాలి. కానీ సమ్మర్ సీజన్‌ని క్యాష్ చేసుకోవాలని కాస్త ఆగారు. అయితే ఇప్పుడు సమ్మర్‌ని కూడా మిస్ చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మీడియం రేంజ్ సినిమాలకు విడుదల తేదీ చాలా ముఖ్యం. పోటీ తక్కువగా ఉన్నప్పుడు బరిలోకి దిగాలి. వేసవిలో కలక్షన్లు క్యాష్ చేసుకొనే సౌలభ్యం ఉంటుంది. యూత్‌ని థియేటర్లకు రప్పించొచ్చు. జూన్‌లో కాలేజీలు మొదలైపోతాయి. ఇలాంటి దశలో మళ్లీ వాళ్లని థియేటర్ల వైపు తిప్పడం చాలా కష్టం అవుతుంది.
అయితే మేకర్స్.. ఐపీఎల్ కోసమే ఈ సినిమాని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. మే 25తో ఐపీఎల్ అయిపోతుంది. అది పూర్తయ్యాకే సినిమా విడుదల చేయాలని ఫిక్స్ అయి ఉంటారు. అందుకే ఈ నిర్ణయం తీసుకొన్నారేమో అనిపిస్తోంది. టాలీవుడ్ పై ఐపీఎల్ ఎఫెక్ట్ గట్టిగానే వుంది. `యావరేజ్` సినిమాల్ని సైతం ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. గత వారం రెండు సినిమాలు (ఓదెల 2, అర్జున్ సన్నాఫ్ వైజయంతీ) విడుదలైనా వసూళ్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ లెక్కల వల్లే `తమ్ముడు` ఈ సీజన్ మిస్ కొట్టాడేమో?