సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువ. ఒక్కొక్కరి సెంటిమెంట్లు ఒక్కో విధంగా వుంటాయి. ముఖ్యంగా కొంతమంది హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు విడుదల తేదీ సెంటిమెంట్లు వుంటాయి. ఆ జాబితాలో నిర్మాత ‘దిల్’ రాజు చేరారు. పుష్కరకాలం క్రితం నిర్మాతగా ఆయనకు ఓ గౌరవం, గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు తెచ్చిన ‘బొమ్మరిల్లు’ చిత్రాన్ని విడుదల తేదీన, తాజాగా ఆయన నిర్మిస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ రోజు అధికారికంగా ప్రకటించారు.
ఆగస్టు 9, 2006… సిద్ధార్థ్ హీరోగా నిర్మించిన ‘బొమ్మరిల్లు’ను విడుదల ‘దిల్’ రాజు చేశారు. ఆగస్టు 9, 2018… నితిన్ హీరోగా నిర్మిస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ని విడుదల చేయనున్నట్టు ఈరోజు అనౌన్స్ చేశారు. ముందు జూలై 24న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే… ఈ నెలలో ‘దిల్’ రాజు సంస్థ నుంచి ‘లవర్’ విడుదలవుతుండడం, సెంటిమెంట్ కారణంగా ఆగస్టుకి తీసుకు వెళ్లారు. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా కథానాయిక. హిందూ పెళ్లిలోని విశిష్టత తెలిపే విధంగా సినిమా తెరకెక్కిస్తున్నారు.