నితిన్ తన 15 ఏళ్ల కెరీర్లో దాదాపుగా 22 సినిమాలు చేశాడు. ఈ ప్రయాణంలో లవర్ బోయ్ పాత్రలే ఎక్కువ. మధ్యలో మాస్ పాత్రలు ట్రై చేశాడు గానీ వర్కవుట్ అవ్వలేదు. అలాంటి నితిన్ తన కెరీర్లో ఇప్పటి వరకూ చేయని ఓ పాత్ర పోషిస్తున్నాడట. అదీ.. పోలీస్‌గా. నితిన్ ఇప్పటి వరకూ ఖాకీ కట్టలేదు. తొలిసారి ఆ అవతారంలో కనిపించబోతున్నాడట. నితిన్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నితిన్ పోలీస్! అయితే మామూలు పోలీస్ కాదు… అండర్ కవర్ పోలీస్. అల్లరి చిల్లరగా తిరిగే ఓ కుర్రాడు సడన్ గా పోలీస్ అయిపోతాడన్నమాట. పోకిరి ఫార్ములా కూడా ఇంచుమించుగా ఇదే కదా? అన్నట్టు అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న దువ్వాడ జగన్నాథమ్లోనూ బన్నీ అండర్ కవర్ పోలీస్ గానే కనిపించబోతున్నాడు.
ఇది వరకు ముసుగు దొంగలు వచ్చేవారు. ఇప్పుడు ముసుగు పోలీసులు తయారవుతున్నారన్నమాట. అందాల రాక్షసితో అడుగుపెట్టిన హను రాఘవపూడి.. లవ్ స్టోరీలు బాగా డీల్ చేయగలడని పేరు తెచ్చుకొన్నాడు. కృష్ణగాడి వీర ప్రేమగాథ కూడా లవ్ స్టోరీనే. ఇప్పుడు పోలీస్ కథ చెబుతున్నా.. అందులో లవ్ ట్రాక్ బాగుంటుందని తెలుస్తోంది.