దాదాపు ఏడెనిమిది ఫ్లాపులు వరసగా ఇచ్చిన నితిన్‌కి ‘ఇష్క్’ వంటి సూపర్‌హిట్ సినమా చేశాడు డైరెక్టర్ విక్రమ్ కుమార్. ఆ తర్వాత ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రం కూడా సూపర్‌హిట్ అవ్వడంతో నితిన్ కెరీర్ ఓ దారిలో పడింది. తన కెరీర్‌ని టర్న్ చేసిన విక్రమ్ కుమార్‌తో మళ్ళీ సినిమా చెయ్యాలనుకున్న నితిన్‌కి ఆ అవకాశం దక్కలేదు. అక్కినేని ఫ్యామిలీతో ‘మనం’ వంటి మెమరబుల్ హిట్‌ని రూపొందించిన విక్రమ్‌కి ఆ సినిమా తర్వాత వెంటనే తమిళ్లో సూర్యతో సినిమా చేసే అవకాశం వచ్చింది. సూర్య పిలుపు అందుకున్న విక్రమ్ వెంటనే చెన్నయ్ జంప్ అయిపోయాడు. సూర్య సొంత బేనర్ 2డి ఎంటర్టైన్మెంట్, కె.ఇ.జ్ఞానవేల్‌రాజా బేనర్ అయిన స్టూడియో గ్రీన్ పతాకాలపై సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ’24’ చిత్రంపై ఆడియన్స్‌లో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ వున్నాయి. ఇప్పటివరకు విక్రమ్ కుమార్ చేసిన సినిమాలన్నీ సూపర్‌హిట్ అవ్వడంతో ’24’ చిత్రం కూడా తనకి పెద్ద హిట్ మూవీ అవుతుందని సూర్య నమ్ముతున్నాడు.
ఈమధ్యకాలంలో సరైన హిట్‌లేని సూర్య మంచి హిట్ కొట్టాలన్న ఉద్దేశంతోనే తన సొంత బేనర్స్‌లో ఈ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు హక్కులు నితిన్ తీసుకున్నాడని తెలుస్తోంది. అఖిల్‌ని హీరోగా పరిచయం చేస్తూ నితిన్ నిర్మించిన ‘అఖిల్’ పెద్ద డిజాస్టర్ అయి అతన్ని నష్టాల్లోకి నెట్టింది. ఇలాంటి టైమ్‌లో తెలుగులో ఈమధ్య హిట్ లేని సూర్య సినిమా హక్కులు తీసుకోవడం రిస్కేనని ట్రేడ్‌వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. కానీ, విక్రమ్కుమార్పైన తనకున్న నమ్మకంతోనే ’24’ తెలుగు హక్కులు తీసుకున్నానని నితిన్ చెప్తున్నాడు. మరి ఈ సినిమా నితిన్‌కి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.