- స్పీచ్ స్టార్టింగులో… ‘కథ విన్న వెంటనే పెళ్లి చేసుకోవాలని అనిపించింది’!
- స్పీచ్ మధ్యలో… ‘పెళ్లి ఇంత కష్టమా? వద్దు బాబోయ్! అనుకున్నా’
- ఆ వెంటనే… ‘సారీ మమ్మీ! టీవీ చూసి కంగారుపడకు. పక్కా పెళ్లి చేసుకుంటా’
ఆదివారం రాత్రి జరిగిన ‘శ్రీనివాస కళ్యాణం’ ఆడియోలో మాట్లాడిన నితిన్.. మూడు నిమిషాల్లో మూడు భిన్నమైన స్టేట్మెంట్స్ ఇచ్చాడు. పెళ్లి గురించి, ఇంట్లో పెడుతున్న పోరు గురించి, సినిమా షూటింగులో ఎదురైన అనుభవాల గురించి టకాటకా చెప్పేశాడు. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు. ఆదివారం ఆడియో విడుదల చేశారు.
ఆడియో వేడుకలో నితిన్ మాట్లాడుతూ “కొన్ని సంవత్సరాలుగా మా అమ్మ పెళ్లి చేసుకోమని చంపేస్తుంది. నేనేమో వద్దంటున్నా. అటువంటి టైమ్లో సతీష్ వేగేశ్న వచ్చి ఈ సినిమా కథ చెప్పారు. కథ ఎంత నచ్చిందంటే… వెంటనే పెళ్లి చేసుకోవాలని అనిపించింది. పెళ్లంటే.. ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్ల టైపులో కాదు. మా సినిమాలో చూపించబోయే పెళ్లి టైపులో. తర్వాత షూటింగ్ మొదలైంది. పెళ్లి సీన్స్, పెళ్లిలో భాగంగా చేసే వ్రతాలు, పూజలు, జనాలు, గోల చూసి… ‘అమ్మో… పెళ్లి అంటే ఇంత కష్టమా? వద్దు బాబోయ్’ అనిపించింది” అన్నాడు. వెంటనే ఏమనుకున్నాడో… ఏమో… “సారీ మమ్మీ. టీవీ చూసి కంగారుపడకు. పక్కా పెళ్లి చేసుకుంటా! ఊరికే ఈ మాటలు చెబుతున్నా” అన్నాడు. అదండీ సంగతి. ఈ సినిమా మీద నితిన్ చాలా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తన కెరీర్లో టాప్ 3 సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని చెప్పాడు.