బీహార్ ఎన్నికల్లో ఎటు చూసినా నిరాశాజనకమైన పరిస్థితులు కనిపిస్తుండటం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఓ వైపు సర్వేల్లో క్రమంగా ఎన్డీయే పుంజుకుంటోంది. ఒకే సంస్థ కొన్ని రోజుల క్రితం చేసిన సర్వే, తాజా సర్వే ఫలితాలను గమనిస్తే లాలు నితీష్ మహా కూటమి సీట్లు తగ్గుతాయని, ఎన్డీయే సీట్లు పెరుగుతాయనే అంచనాలు వెలువడ్డాయి. తాజాగా టైమ్స్ నౌ సర్వే కూడా ఇదే విషయం తెలిపింది. ఎన్డీయే చాలా వేగంగా పుంజుకుంటోందని, మహా కూటమి అంతే వేగంతో బలం కోల్పోతోందని తేల్చింది. లాలుతో దోస్దీ నితీష్ కు తీవ్ర నష్టం కలిగిస్తుందని అనేక సర్వేలు అంచనా వేశాయి.
మొదటి రెండు సర్వేల్లో మహా కూటమికే అనుకూల ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత అంతా ఎన్డీయేకు సానుకూల ఫలితాలే వస్తున్నాయి. అందుకే, తమకు మూడింట రెండు వంతుల సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు ఎన్డీయే నేతలు.
ఇక, బీహార్ అభివృద్ధికి సంబంధించి బీజేపీ అడిగే సూటి ప్రశ్నలకు జవాబు చెప్పడానికి నితీష్ ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఒకేరోజు మూడు ప్రశ్నాస్త్రాలను సంధించారు. బీజేపీతో జేడీయూ తెగతెంలపులు చేసుకున్న తర్వాతి పరిణఆమాలకు సంబంధించిన ఆ ప్రశ్నలు ఇలా ఉన్నాయి…
1. 2012-13లో ఇరుపార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పటికంటే, తెగతెంపులు అయిన తర్వాత 2013-14లో రాష్ట్ర వ్యవసాయ ఆదాయానికి సంబంధించిన జీడీపీ 11.5 శాతం తగ్గింది. ఎందుకు?
2. రాష్ట్ర వృద్ధి రేటు 2012-13లో 15.5 శాతం. అప్పుడు బీజేపీకూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. తెగతెంపుల తర్వాత, 2013-14లో 8.8 శాతానికి పడిపోయింది. ఎందుకు?
3. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలోనూ బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు అంతా బాగుండేది. 2012-13లో 17 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయి. 2013-14లో ఈ పెట్టుబడులు దారుణంగా, 6 వేల కోట్లకు పడిపోయాయి. ఎందుకు?
ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడం నితీష్ ప్రభుత్వానికి సంకటంగా మారింది. పైగా ఇవన్నీ స్వయంగా రాష్ట్ర ఆర్థిక సర్వే, కేంద్ర గణాంకాల ఆధారంగా చెప్పిన విషయాలు. ఈ లెక్కలు అబద్ధం అని దబాయించడానికి వీల్లేదు.
తాజాగా పైపుల ద్వారా నీటి సరఫరాకు సంబంధించి మరో తాజా నివేదిక బయటపడింది. దీని ప్రకారం, బీహార్లోని ఇళ్లలో 6 శాతానికే పైపుల ద్వారా నీరు సరఫరా అవుతోంది.
వచ్చే ఎన్నికల నాటికి ఊరూరా, ఇంటింటా కరెంటు సరఫరా చేస్తాం, ప్రతి గ్రామానికి పైపుల ద్వారా నీరు సరఫరా చేస్తామని 2010లో నితీష్ కుమార్ హామీ ఇచ్చారు. మాట నిలబెట్టుకోకపోతే 2015 ఓటు అడగను అని కూడా శపథం చేశారు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చకుండా ఓటు ఎలా అడుగుతున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది.
రేపు ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు ప్ర్రజలు కూడా ఇదే ప్రశ్న అడగవచ్చు. మరి ఏం జవాబు చెప్పాలి? ఇదే నితీష్ కు టెన్షన్ కలిగిస్తోంది. ఎటు చూసిన ప్రతికూల వాతావరణంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పరిస్థితి చేయి దాటిపోతోందని ఆందోళన చెందుతున్నారని జేడీయూ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీ తో తెగతెంపులు చేసుకోవడం ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని అనుయాయులు ఆవేదన చెందుతున్నారు.