మలయాళ కథానాయికలకు తెలుగు సినిమా అంటే కాస్త చిన్నచూపు. ఇక్కడి సినిమాల్లో నటిస్తూ, ఇక్కడి పారితోషికం అందుకొంటూ, ఇక్కడ పేరు ప్రతిష్టలు సంపాదించుకొంటూ తెలుగు సినిమా అంటే చులకనగా మాట్లాడతారు. నిత్యమీనన్ కూడా అంతే. తెలుగు సినిమాల్లో విషయం ఉండదని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతోంది. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ పరమ చాదస్తంగా ఉంటుందని, హీరో ఎంత ఎలాంటోడైనా హీరోయిన్ అతని వెంట పడాల్సివస్తోందని, హీరోయిన్ కోసం హీరో చేసే పోరాటమే సినిమాలకు కథా వస్తువు అవుతోందని, ఇలాంటి రొటీన్ కథల్లో నటించడం వల్ల కథానాయికలకు ఒరిగేదేం ఉండదని తేల్చి చెప్పింది నిత్య. అందుకే తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయట్లేదని చెప్పుకొచ్చింది.
నిత్య తెలుగులో నటించిన అలా మొదలైంది, గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్, మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు.. కొత్త కథలేం కావు. కానీ కథానాయిక పాత్రకు కీలకమైన స్థానం ఇచ్చిన సినిమాలవి. దానికితోడు తెలుగు సినిమాల ద్వారానే నిత్య ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఆ సంగతి మర్చిపోయి తెలుగు సినిమాలపైనే ఫైర్ అవ్వడం.. కాస్త ఇబ్బంది పెట్టే విషయమే. ఒక్క మలయాళంలో తప్పిస్తే తమిళ కన్నడ చిత్రాల్లోనూ ఇలాంటి రొటీన్ స్టోరీలే వస్తున్నాయి. అలాంటప్పుడు తెలుగు సినిమాని టార్గెట్ చేసి మాట్లాడడం ఎందుకు..?? ముక్కు సూటిగా మాట్లాడి చాలాసార్లు విమర్శల పాలైంది నిత్య. ఈసారీ అంతే అనుకోవాలేమో?