నిత్యమీనన్‌కి మీడియా అంటే కాస్త కోపం. అందుకే ఇంటర్వ్యూలకు, చిట్ చాట్‌లకూ దూరంగా ఉంటుంది. తానొకటి చెబితే… మరోటి రాస్తారని చాలా సందర్భాల్లో బాధ పడిపోయింది. తన కెరీర్ మొదట్లో.. ‘ప్రభాస్ ఎవరు’ అంటూ నిత్య చేసిన కామెంట్ అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. నిత్యని ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఆడుకొన్నారు. కొన్నాళ్ల పాటు తన ఇంటర్వ్యూల్లో ఇదే ప్రశ్న రిపీట్ అయ్యింది. ఆ విషయాన్ని నిత్య ఇప్పటికీ మర్చిపోలేకపోతోంది. ఇప్పుడు మరోసారి ప్రభాస్ ఊసు ఎత్తింది.
ఓ ఇంటర్వ్యూలో.. ”నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నాను. స్వతహాగానే సినిమాలు చూడను. తెలుగు సినిమాల గురించి పెద్దగా పరిచయం లేదు. తెలుగులో చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్ పేర్లే కేరళలో వినిపించేవి. మిగిలిన హీరోల గురించి పెద్దగా తెలీదు. ఓ సందర్భంలో ప్రభాస్ ప్రస్తావన వచ్చింది. మాటల్లో పడి.. సరిగా వినలేదు. ‘ఎవరు..?’ అని అడిగితే… దానికి నాకు ప్రభాస్ ఎవరో తెలీదంటూ హెడ్డింగులు పెట్టి వార్తలు రాశారు. నేను ప్రభాస్‌ని తక్కువ చేయలేదు. మీడియానే… నన్ను అర్థం చేసుకోలేదు” అంటూ గతాన్ని మరోసారి గుర్తు చేసుకొని వాపోయింది. నిజానికి.. ఈ సంగతి జనాలు ఎప్పుడో మర్చిపోయారు.కానీ.. నిత్య మీనన్ మాత్రం గుర్తు చేసుకొని మరీ బాధ పడుతోంది.