ఎన్టీఆర్ జీవితం ఓ కథగా చెప్పాల్సి వస్తే బసవతారకం పాత్రకీ స్థానం ఉంది. ఇప్పుడు చూస్తున్న బసవతారకం కాన్సర్ ఆసుపత్రి స్థాపనకు ఓ విధంగా బసవతారకం కారణం. ఆమె చివరి రోజుల్లో కాన్సర్తో పోరాడి మరణించారు. ఆమె జ్ఞాపకంగానే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించారు. ఎన్టీఆర్ కథని ‘ఎన్టీఆర్’ పేరుతో బయోపిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బసవతారకం పాత్రకు గానూ చాలామంది కథానాయికల పేర్లు పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా చిత్రబృందం నిత్యమీనన్ని సంప్రదించినట్టు తెలుస్తోంది. ముందు ఈ కథలో నటించడానికి ‘ఓకే’ చెప్పేసిన నిత్య.. ఒకట్రెండు రోజుల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పాత్ర చేయలేను’ అని తెగేసి చెప్పేసిందట. నిత్య ‘నో’ చెప్పిన ‘పరిస్థితులు’ ఏంటన్నది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం బాలయ్య స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్తో అనుబంధం ఉన్న నిర్మాతల్ని, దర్శకుల్ని, కెమెరామేన్లను బాలయ్య వ్యక్తిగతంగా వెళ్లి కలసి వస్తున్నారు. వాళ్ల అనుభవాలు కూడా తెరపై కనిపించే అకాశం ఉంది.