‘నాకు నచ్చిన పాత్రలే చేస్తా’
అని భీష్మించుకుని కూర్చునే మొండిఘటం నిత్యమీనన్.
అందుకే నిత్య ఓ పాత్ర చేసిందంటే… దానికి తప్పకుండా ఓ ప్రత్యేకత ఉండి తీరుతుంది. ‘లేడీ ఓరియెంటెడ్’ తరహా సినిమా ఒక్కటి చేయకపోయినా… కథంతా తనవైపుకు తిప్పుకునే స్థాయి పాత్రల్లో నటించి, మెప్పించింది నిత్య. నాని నిర్మాతగా తెరకెక్కించిన ‘అ’లోనూ ఓ సాహసోపేతమైన పాత్ర చేసింది. ఇందులో లెస్బియన్‌గా కనిపించింది నిత్య. ఈ సందర్భంగా నిత్యతో తెలుగు 360 చేసిన చిట్ చాట్
హాయ్ నిత్య
హాయ్
సినిమా సినిమాకీ మధ్య గ్యాప్ విపరీతంగా తీసుకుంటుంటారు. ఈ విరామంలో ఏం చేస్తుంటారు?
సినిమా కంటే ముఖ్యమైనవి జీవితంలో చాలా ఉన్నాయి. సినిమా అనేది ఓ పార్ట్ మాత్రమే. నేనక్కడ, ఏ పనిచేస్తుంటే హ్యాపీగా ఉంటానో నాకు తెలుసు. అలా నాకు సంతోషం ఇచ్చే పనులనే చేస్తుంటా.
రుద్రమదేవి, `అ` లాంటి సినిమాల్లో మీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ. అయినా ఏ ధైర్యంతో సినిమాల్ని ఒప్పుకున్నారు?
నేనెప్పుడూ సినిమాని సినిమాలా చూస్తాను. నా పాత్ర గురించి చాలా తక్కువ ప్రాధాన్యం ఇచ్చుకుంటాను. దర్శకుడు చెప్పిన కథ ఓ సినిమాగా నాకు నచ్చితే.. అందులో ఎలాంటి పాత్ర అయినా చేస్తా.
లెస్బియన్ పాత్ర కోసం మిమ్మల్ని సంప్రదించినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏమిటి?
నాకు కొత్తగా అనిపించింది. ఇలాంటి పాత్రలు చేసే అవకాశం చాలా తక్కువగా వస్తుందని నాకు తెలుసు. అందుకే మరేం ఆలోచించకుండా.. ఒప్పుకున్నా.
నాని కోసమే ఈ సినిమా చేశారా?
అదేం లేదు. కథ కోసం చేశా. నేనే కాదు… ఈ టీమ్‌లో ఉన్నవాళ్లంతా కథని, దర్శకుడు ప్రశాంత్ వర్మనీ నమ్మి పనిచేసినవాళ్లే.
పారితోషికం విషయంలో నానికి ఏమైనా రిబేట్ ఇచ్చారా?
(నవ్వుతూ) చాలా రిబేటే ఇచ్చా..
ఇలాంటి పాత్రలు చేస్తున్నప్పుడు సమాజంపై ఏమైనా ప్రభావం చూపిస్తుందా? అనేమైనా ఆలోచిస్తారా?
ఆలోచిస్తా. అది అవసరం కూడా. సమాజంలోని ఆడ పిల్లలు ఏమైనా అతిగా ఆలోచిస్తారా? నా పాత్ర ప్రభావం, సినిమా ప్రభావం ఏమైనా పడుతుందా? అనే విషయాల్ని పరిగణలోనికి తీసుకుంటా. కానీ `అ`లోని నా పాత్ర ఎలాంటి నెగిటీవ్ ఇంపాక్ట్ తీసుకురాదు అనిపించింది. అందుకు ఒప్పుకున్నా.
సౌత్ ఇండియాలోనే ఇలాంటి పాత్రలు చేసిన కథానాయికలు చాలా అరుదు. మీరు ఏమైనా కసరత్తులు చేశారా?
కసరత్తులు చేసేంత గొప్ప పాత్రలేవీ రావడం లేదండీ. అంత అవసరం అయితే ఈ పాత్రకు రాలేదు. అయితే సెట్‌కి వెళ్లే ముందు మాత్రం.. `నేను ఎంత వరకూ డీల్ చేయగలను` అని నాకు నేనే క్వశ్చన్ చేసుకున్నా.
మీలో నటికి పూర్తిగా సవాల్ విసిరిన పాత్రలేం రాలేదనే అనుకుంటున్నారా?
గంగలో నేను చేసిన పాత్ర నన్ను సవాల్ చేసింది. శారీరకంగానూ, మానసికంగానూ చాలా కష్టపడి చేసిన పాత్ర అది.
మహానటిలో సావిత్రి పాత్ర కోసం ముందు మిమ్మల్నే సంప్రదించారు. కానీ `నో` చెప్పారు.. కారణం ఏమిటి? పారితోషికం నచ్చలేదా?
ఆ కథ ముందు నా దగ్గరకే వచ్చింది. కానీ వర్కవుట్ కాలేదు. పారితోషికం కారణం కాదు.
ఎన్టీఆర్ బయోపిక్‌లో బసవతారకం పాత్రకి కూడా మీరు `నో` చెప్పారట..
ఆ సినిమాలో నేను లేను.. అంతకు మించి ఏం అడక్కండి.
చాలా ఈజీగా నో చెప్పేస్తారట కదా?
అవును. కథలో నాకు చిన్న అనుమానం ఉన్నా.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోను. నా స్వభావమే అంత. కథ నచ్చితే మాత్రం అన్ని విషయాల్లోనూ నా సహకారం అందిస్తా.
తెలుగులో కొత్త సినిమాలేమైనా ఒప్పుకున్నారా?
కొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఇంకా ఏదీ ఒప్పుకోలేదు. మలయాళంలో ఓ సినిమా చేస్తున్నా. అది తెలుగులోనూ విడుదల అవుతుంది. సినిమా మొత్తం నేను మాత్రమే ఉంటా. మరో పాత్ర కనిపించదు. ఓ విధంగా ప్రయోగాత్మక చిత్రమది