అవకాశాలు వచ్చినప్పుడే ఒడిసిపట్టుకోవాలి. అవి చేజారిపోయాక.. ఆరాటపడడంలో అర్థం లేదు. చిత్రసీమలో అవకాశమే గొప్పది. దాన్ని ఎంత వరకూ సద్వినియోగం చేసుకుంటామనే విషయంపైనే కెరీర్ ఆధారపడి ఉంటుంది. ఆ సంగతి నిత్యమీనన్కి ఇప్పుడిప్పుడే అర్థమవుతోందేమో..?
ఒకప్పుడు నిత్యమీనన్ హవా బాగా సాగింది. కథానాయిక పాత్ర ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు కేరాఫ్ గా నిలిచింది. మరో సౌందర్య అనే పేరు తెచ్చుకుంది. అయితే తన యారగెన్సీ వల్ల కొన్ని అవకాశాల్ని దూరం చేసుకుంది. కథలు పట్టుకుని దర్శకులు, నిర్మాతలు వెంటపడుతున్నప్పుడు లైట్ తీసుకుంది. ఆ సమయంలో `మహానటి` లాంటి అద్భుతమైన సినిమాలు సైతం నిత్యమీనన్కు దూరమయ్యాయి. ఇప్పుడు టాలీవుడ్ దాదాపుగా నిత్యమీనన్ని మర్చిపోయింది. తనలాంటి ప్రతిభావంతమైన కథానాయికలు అందుబాటులో ఉండడంతో.. నిత్య కనుమరుగైపోయింది.
అయితే ఇప్పుడు నిత్య మళ్లీ టాలీవుడ్ పై దృష్టి పెడుతోంది. తెలుగులో తనకేమైనా అవకాశాలు వస్తాయేమో అనే దిశగా ఆలోచిస్తోంది. తన పాత పరిచయాల్ని ఉపయోగించుకుంటూ, సినిమాల్ని చేజిక్కించుకునే ప్రయత్నాల్ని ప్రారంభించింది. ఈ కోవలోనే సత్యదేవ్ తో ఓ సినిమా ఫిక్సయ్యింది. సత్యదేవ్ కథానాయకుడిగా నిత్యమీనన్ హీరోయిన్ గా ఓ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. దీంతో పాటు ఒకట్రెండు సినిమాల్ని ట్రాక్ ఎక్కించాలని భావిస్తోందట. నిత్యమీనన్ ప్రధాన సమస్య… తన శరీరాకృతి. ఈమధ్య మరీ లావైపోయింది. అందుకే.. ఇప్పుడు ఆ విషయంపై కూడా నిత్య శ్రద్ధ పెట్టిందని తెలుస్తోంది. ఇది వరకు నిత్య సవాలక్ష కండీషన్లు పెట్టేది. అవన్నీ ఇప్పుడు తగ్గించుకుందని సమాచారం. మొత్తానికి… నిత్య ఓ మెట్టు దిగడానికి సిద్ధమైంది. కానీ.. దర్శక నిర్మాతలు కూడా రెడీ అవ్వాలి కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిత్య మళ్లీ తనదైన ప్రభావం చూపించడం కష్టమే. ఒకవేళ నిత్యకు మళ్లీ సినిమాలు అందితే, ఇది వరకటి ఫామ్ కొనసాగితే.. అది అద్భుతమే అనుకోవాలి.