తెలుగు రాష్ట్రాల్లో బసవతారకం, సత్యసాయి ఆస్పత్రుల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నిరుపేదలకు ఈ ఆస్పత్రులు ఆరోగ్యప్రదాయినీలు. ఇప్పుడు కాదు..దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఈ ఆస్పత్రుల గురించి నీతిఆయోగ్ ప్రశంసాపూర్వకమైన మాటలుచెప్పడమే కాదు.. ఈ ఆస్పత్రులకు ఇచ్చే విరాళాలకు వంద శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. కోవిడ్ కాలంలో వైద్య సేవలు ఎంత భారమో.. ప్రతి ఒక్కరికీ తెలిసిపోయింది. ప్రభుత్వ రంగంలో సరిపడా మౌలిక సదుపాయాల్లేవు.. ప్రైవేటురంగంలో దోపిడీ. ఇక రోగం బారిన పడ్డ సామాన్యులకు ఎవరు వైద్యం చేస్తారు..? అలాంటి వారికి ఈ ఆస్పత్రులు అండగా నిలిచాయి.
తెలుగు రాష్ట్రాల పేదల “క్యాన్సర్ చికిత్స కేంద్రం” బసవతారకం..!
బసవతారకం మెమెరియల్ క్యాన్సర్ ఆస్పత్రి గురించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. క్యాన్సర్ అంటే.. పేదలకు వైద్యం చేయించుకోలేని జబ్బు. కానీ.. ఎన్టీఆర్ .. తన సతీమణి క్యాన్సర్తో చనిపోవడంతో… సరైన చికిత్స చేయించలేకపోయారు. అప్పటికి సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. ఇక పేదలకు క్యాన్సర్ లాంటివి వస్తే ప్రాణాలు వదిలేసుకోవడమే. ఈ పరిస్థితిని మార్చాలని ఎన్టీఆర్ బసవతారకం ఆస్పత్రిని లాభాపేక్ష లేకుండా నిర్మించాలని నిర్ణయించారు. తన సొంత సొమ్ముకు విరాళాలు తీసుకుని ఆస్పత్రిని నిర్మించి..2000 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటి నుండి పేదలకు క్యాన్సర్ వైద్యంలో నమ్మకమైన ఆస్పత్రిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ఆస్పత్రికి చైర్మన్గా బాలకృష్ణ ఉన్నారు. 500 పడకలకు విస్తరించారు. తెల్లకార్డు ఉన్న పేదలకు దాదాపుగా ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఇతరులకు కూడా చాలా తక్కువ మొత్తంతో క్యాన్సర్ వైద్యం అందిస్తారు. ఆస్పత్రి నిర్వహణకు విరాళాలే ఎక్కువగా ఆధారం. వ్యాధి వచ్చిన వారికే కాకుండా.. క్యాన్సర్ రాకుండా అవగాహన చేపట్టడం.. పేదల ప్రజలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం వంటివి చేస్తోంది. రాష్ట్రవిభజన తర్వాత అమరావతిలోనూ ఆస్పత్రి కట్టడానికి శంకుస్థాపన చేశారు కానీ.. ప్రస్తుత ప్రభుత్వం భూమిని వెనక్కి తీసుకుంది.
ప్రభుత్వాసుపత్రులకు మించి ఉచిత సేవలందించే సత్యసాయి ఆస్పత్రి..!
అనంతపురంలోని సత్యసాయి ఆస్పత్రి గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒక్క రూపాయి తీసుకోకుండా అత్యాధునిక వైద్యం అందిస్తూ ఉంటుంది ఆస్పత్రి. 1948లో ఏర్పాటై.. రోగులందరికీ ఉచిత వైద్యం అందిస్తోంది. ప్రతి నెలా అనంతపురం జిల్లాలోని 12 నోడల్పాయింట్లలో మొబైల్ ఆసుపత్రులను నిర్వహిస్తోంది. 400 గ్రామాల ప్రజలు ఉచితంగా సేవలు పొందుతున్నారు. కరోనాసమయంలోనూ అద్భుతమైన సేవలను సత్యసాయి ఆస్పత్రి అందించింది.
వాటిని నిర్వహించడానికి ఇచ్చే విరాళాలకు పన్ను వద్దని నీతి ఆయోగ్ సిఫార్సు..!
ఈ ఆస్పత్రులకు లాభాపేక్ష లేదు. ఏదైనా విరాళమో.. ఆదాయమో వస్తే.. ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాల కోసమే ఖర్చు చేస్తారు. ఇప్పటి వరకూ వీటికి వచ్చే విరాళాల్లో యాభై శాతం పన్ను మినహాయింపు ఉంది. ఇక నుంచి వంద శాతంఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఓ రకంగా ఈ ఆస్పత్రులు పేదలకు ప్రభుత్వాలు విధిగా అందించాల్సిన వైద్యం బాధ్యతను తమ మీద వేసుకుంటున్నాయి. ఇలాంటివాటికి ప్రభుత్వం తగిన విధంగా సహకరించాల్సిన అవసరం ఉంది. నీతిఅయోగ్ తెలుగురాష్ట్రాల్లో ఈ రెండు ఆస్పత్రుల గురించి మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇలాంటి స్వచ్చమైనసేవ చేసే ఆస్పత్రుల గురించి కూడా చెప్పింది.