తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ముందుగా కలిగిన అనుమానం.. పోలవరం ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా ముందుకు సాగుతుందా అని..!. నిన్నామొన్నటి వరకూ …ఇవే అనుమానాలున్నాయి. నిర్మాణ పనులపై ఎన్జీటీ ఇచ్చిన స్టే ఆర్డర్‌పై పర్యావరణ శాఖ కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వడం ఆలస్యమయ్యే సరికి… అంతా రాజకీయం ఎఫెక్టేననుకున్నారు. కానీ..ఆ తర్వాత ఈ ఇబ్బంది తీరిపోయింది. పోలవరం పర్యటనకు వచ్చిన గడ్కరీ మిగిలి ఉన్న అనుమానాలను కూడా తీర్చే ప్రయత్నం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కు… రాజకీయాలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. రాజకీయాల ప్రభావం అభివృద్ధి పనులపై ఉండకూడదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ… పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడాని కట్టుబడి ఉన్నారని తేల్చి చెప్పారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం…నిర్వాసితులకు పంపిణీ చేయడానికి చంద్రబాబు రూ. 10వేల కోట్ల అడ్వాన్స్ అడిగారని.. ఇప్పించడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు.
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు సంకల్పాన్ని నితిన్ గడ్కరీ ప్రశంసించారు. చంద్రబాబు పట్టుదల తనను ఆశ్చర్య పరిచిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అద్భుతమైన పురోగతి కనిపిస్తోందన్నారు. ఓ భారీ ప్రాజెక్ట్ నిర్మాణం ఇంత వేగంగా పనులు జరగడం చూసి తనకు ఆశ్చర్యమేసిందన్నారు. సహజంగానే భారీ కాంట్రాక్టర్ అయిన.. నితిన్ గడ్కరీ.. ఈ మాటలు చెప్పడంతో.. ప్రాజెక్ట్ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న అధికారులతో పాటు.. చంద్రబాబు కూడా సంతోషపడ్డారు. ప్రాజెక్ట్ కు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నా.. అధిగమిస్తామనే ధీమా వ్యక్తం చేశారు.
అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్ట్ కోసం… ఏమేం కావాలో…ఏకరవు పెట్టారు. జెట్ గ్రౌంటింగ్ పనులు పూర్తిచేశామని.. ఫిబ్రవరి నాటికి కాంక్రీట్ పనులు పూర్తిచేస్తామని నితిన్ గడ్కరీకి వివరించారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరానికి రూ. 57,940 కోట్లు అవుతుందని గుర్తు చేశారు. దీనికి సంబంధించిన డీపీఆర్ -2ను ఆమోదించాలని కోరారు. ఇందులో భూసేకరణకే రూ. 33వేల కోట్లు అవుతుందని గుర్తు చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రధాన అవరోధం.. పునరావాసమే. కొత్త చట్టం ప్రకారం రూ. 33వేల కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి అవసరం. కానీ కేంద్రం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినా.. ఈ ఆర్ ఆండ్ ఆర్ ఖర్చులు భరిస్తామని మాత్రం చెప్పలేదు. టీడీపీ ఎన్డీఏలో ఉన్నప్పుడే.. దీనిపై ఒత్తిడి తెచ్చినా.. ఆర్థిక శాఖ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ప్రధాన కట్టడం ఒక్కదాని ఖర్చే భరిస్తామన్నట్లుగా చెప్పుకొచ్చారు. అసలు నిర్వాసితులకు పునరావాసం లేకుండా ప్రాజెక్ట్ ఎలా ఉంటుందని.. ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. గడ్కరీ పర్యటన తర్వాత ఏపీ ప్రభుత్వాన్ని ప్రాజెక్ట్ విషయంలో కేందరంపై కాస్తంత నమ్మకం కలిగి ఉంటుంది. డీపీఆర్ -2ని ఆమోదిస్తే..ఇక పోలవరం ప్రాజెక్ట్ కు సమస్యలు తీరిపోయినట్లే భావించవచ్చు.