పోలవరం ప్రాజెక్టుకు నిధులు నిర్మాణం విషయమై కేంద్ర రాష్ఠ్ర ప్రభుత్వాలలోని బిజెపి టిడిపిలు దాగుడు మూతలాడుతున్నాయని నీటి పారుదల మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి నిరూపించారు. ఇటీవల ఈ విషయమై విమర్శలు వివాదాల నేపథ్యంలో ఆయన సర్దుబాటు వ్యాఖ్యలుచేశారు గాని తన వాదనలు వదులుకోలేదు. ఇవ్వాల్సిన బిల్లులన్నీ ఇచ్చేశామని చెబుతున్నారు గాని రాష్ట్రం లెక్క ప్రకారం మూడు వేల కోట్ల పైనే రావలసి వుంది.ఢిల్లీలో గడ్కరీ ప్రకటన వచ్చినప్పుడే ఎపిలో చంద్రబాబు కూడా ఈ స్పష్టత ఇచ్చారు. రాష్ట్రప్రభుత్వం పంపిన బిల్లులన్నీ చెల్లించేశామని గడ్కరీ అన్నదానిపై రాష్ట్రం స్పందించలేదు. పైగా ఈ నెల 22న స్వయంగా తానే పోలవరం పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తానని కూడా ఆయన ప్రకటించారు. అయితే మరోవైపు తాము రాష్ట్రానికి సహకరిస్తామని, ఉభయులం కలసి 2018కి ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు. విచిత్రమేమంటే గడ్కరీ ఆధ్వర్యంలోని జలవనరుల శాఖ నివేదికలో ఎక్కడా 2018కి దీన్ని పూర్తి చేయాలని గడువు పెట్టుకోలేదు. వారి నివేదికల్లో ఇతర జాతీయ ప్రాజెక్టులకు కొన్ని తేదీలు ఇచ్చారు గాని పోలవరంకు వచ్చే సరికి ఎలాటి గడువు లేదని స్పష్టంగా రాశారు. టిడిపి వచ్చే ఎన్నికలకోణంలో 2018, 2019 అనొచ్చు గాని అవాస్తవమని తెలిసీ కేంద్ర మంత్రి ఎందుకు ఆ మాటే చెబుతున్నారు? మళ్లీ ఆయనే ఎందుకు నిధులు రావలసివుందనే వాస్తవాన్ని నిరాకరిస్తున్నారు? గోదారి తల్లికే తెలియాలి మరి.