పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ఎపి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు హామీ ఇచ్చినట్టు కొన్ని ఛానళ్లు ప్రసారాలు చేస్తున్నాయి. అయితే ఆ కథనాలను లోతుగా ఆలకిస్తే అసలు సంగతి అర్థమవుతుంది. కొత్తగా టెండర్లను ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌కు కేంద్రం అభ్యంతరం చెప్పింది. ఇప్పటికీ వాటిని వదులుకోలేదట. కాకుంటే అవి సహాయానికి అడ్డంకి కాబోవని గడ్కరీ వివరించారట. ఆలస్యం నివారించడానికి ఇతరులను ఆహ్వానించాలని ప్రభుత్వం చెప్పింది. మరి వాటిని నిలిపివేస్తే ఆలస్యం తప్పదు కదా? రెండో విషయం పునరావాసవ్యయంతో తమకు సంబంధం లేదని కూడా గడ్కరీ అన్నట్టు కథనాలున్నాయి. అనుకూల ప్రసారాలు చేస్తున్న వారు కూడా కేంద్రం ఆ మొత్తం ఇవ్వడానికి అంగీకరించిందని చెప్పడం లేదు. అయితే ఏది ఏమైనా 2019లోపు పూర్తి కావడానికి తోడ్పాటు నిస్తామన్నట్టు మామూలు కథనే వినిపిస్తున్నారు. నిజానికి కేంద్ర జలవనరుల శాఖ నివేదికల్లో 2019 అన్న గడువే లేదు. అసలు గడువు లేదని కూడా స్పష్టంగా రాశారు. కాఫర్ డ్యాం సహాయంతో నీటిని విడుదల చేశామనిపించుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మాత్రమే. ఈ విషయమై దక్షిణ కొరియా పర్యటనలో వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఫోన్లో మాట్లాడారట. మరోవైపున కాంగ్రెస్ నేతలుప్రతినిధివర్గంగా కలిశారు.నిజంగా సహాయం చేయడమే కేంద్రం విధానమైతే వారికి కూడా స్పష్టంగా చెప్పి వుండేవారు. ఇంతకూ గడ్కరీ 280 కోట్టు విడుదల చేయడాన్ని కూడా అమితంగా చెబుతున్నారు. వాస్తవంగా కేంద్రం నుంచి రావలసింది ఇందుకు పదిరెట్టు వుంటుంది.కాబట్టి గడ్కరీ ఇచ్చినట్టు చెబుతున్న హామీకి లేనిపోని ప్రచారం జరుగుతుందని చెప్పకతప్పదు. ఒక నమస్కారం పెట్టి తప్పుకుంటానన్న రాష్ట్రప్రభుత్వం తానే తగ్గి ఏదో సాధించినట్టు చూపించుకునే తాజా ప్రయాసే ఈ ప్రకటనలు.