ప్రధానమంత్రి అభ్యర్థి రేసులో తాను ఉండననీ, ప్రస్తుతం ఉన్న మంత్రి పదవితోనే సంతృప్తిగా ఉన్నానంటూ ఈ మధ్యనే కేంద్రమంత్రి నితిన్ గట్కరీ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల అనంతరం మొదలైన చర్చ ఇంకా సద్దుమణగక ముందే… ఇప్పుడు మరోసారి కొంత ఘాటుగానే స్పందించారు. ఎన్నికల్లో వైఫల్యాలకు పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలంటూ ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు భాజపాలో ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్యేలు, ఎంపీలు విఫలమైతే ఆ బాధ్యత పార్టీ పెద్దగా అధ్యక్షుడే తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు… పార్టీలో నాయకుల వైఫల్యాలకు తానే బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా, వేరొకరిపైన నెపాన్ని నెట్టలేం కదా అంటూ గట్కరీ వ్యాఖ్యానించారు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓటమి సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా పరోక్షంగా ప్రస్థావిస్తూ… గట్కరీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. విజయం వస్తే అందరూ తమదే అన్నట్టుగా ముందుకొస్తారనీ, దానికి కారణం తమ వంతు కృషి చాలా ఉందని చెప్పుకుంటూ ఉంటారనీ, అదే ఓటమి ఎదురైతే ఎవ్వరూ పట్టించుకోరనీ, ఓటమిని అనాథను చేసేస్తారని గట్కరీ అన్నారు. అంతేకాదు, ఓటమికి కారణాలు వెతుక్కునే క్రమంలో పక్కవారిలో లోపాలను చూపుతారని చెప్పారు. మూడు రాష్ట్రాల్లో భాజపా ఓటమి అనంతరం ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు భాజపాలో కూడా తీవ్ర చర్చకు కారణమౌతోంది.
ప్రస్తుతం గట్కరీ చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోడీని, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను ఉద్దేశించి చేసినవే అనేది స్పష్టంగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని మారుస్తూ.. గట్కరీ పేరును ప్రస్థావిస్తూ మహారాష్ట్రకు చెందిన కొంతమంది పార్టీకి లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఆ చర్చతో తనకేం సంబంధం లేనట్టుగా గట్కరీ తప్పుకున్నారు. కానీ, ఇప్పుడు ఇలా వ్యాఖ్యానించడం చూస్తుంటే… ఆ ప్రతిపాదనపై గట్కరీ అసలు స్పందన ఇదేనా అన్నట్టుగా కనిపిస్తోంది. పార్టీ వైఫల్యం గురించి చర్చను పెద్దది చేయడమే గట్కరీ ఉద్దేశమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ చర్చ పెద్దదైతే అంతిమంగా ఎక్కడికి చేరుతుందీ… మహారాష్ట్ర నుంచి వినిపిస్తున్న ఆ డిమాండ్ దగ్గరకే కదా! ఏదేమైనా, ఏదో ఒక వ్యూహం లేకుండా ఇలా నేరుగా మోడీ, అమిత్ షాలను లక్ష్యం చేసుకుని విమర్శలు చెయ్యరు కదా!