తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలసి నడుస్తామని కానీ.. కూటమిగా ఉంటామని కానీ జేడీయూ నేత నితీష్ కుమార్ హామీ ఇవ్వలేదు. కేసీఆర్ తో కలిసి ప్రెస్మీట్లో పాల్గొన్న ఆయన కేసీఆర్ .. రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నేత అని.. ఆయన అదే విధంగా ప్రయత్నిస్తారని అన్నారు కానీ.. ఆయనతో కలిసి నడుస్తామని మాత్రం ఎక్కడా చెప్పలేదు. ప్రెస్మీట్లో నితీష్ నాయకత్వ వహిస్తాడన్నట్లుగా కేసీఆర్ మాట్లాడేసమయానికి ఆయన లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అయితే కేసీఆర్ రిక్వెస్ట్ చేసి కూర్చోబెట్టారు. అయితే నితీష్ రాజకీయ ప్రకటనలు మాత్రం చేయలేదు. జాతీయ రాజకీయాల్లో తన పార్టీ పాత్ర.. తన పాత్ర గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
అయితే కేసీఆర్ మాత్రం బీజేపీ ముక్త భారత్ కోసం కలిసి పని చేస్తామని ప్రకటించారు. దేశంలో వచ్చేది థర్డ్ ఫ్రంట్ కాదు… మెయిన్ ఫ్రంట్ అని చెప్పారు. బీజేపీ పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయిందని, అందుకే దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని, ఈ విషయం గురించి నితీశ్‌తో కూడా చర్చించామని చెప్పారు. ప్రతిపక్షాలు ఉన్న ప్రభుత్వాలను పడగొట్టడమే ప్రధాని మోడీ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.బీజేపీ ముక్త్ భారత్ తోనే దేశాన్ని ముందుకు తీసుకుపోతామని తెలిపారు. విపక్షాలతో కలిసి బీజేపీ ముక్త్ తో భారత్ కు కృషి చేస్తామన్న కేసీఆర్.. బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు.
నితీశ్ కూడా బీజేపీ ముక్త్ భారత్ కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తీస్తోందని బీజేపీపై మండిపడ్డారు. అలాంటి బీజేపీని సాగనంపితేనే భారతదేశం ప్రగతి పథంలో నడుస్తుందన్నారు. అందుకే బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తున్నామని, ఆ పార్టీని వ్యతిరేకించే వారందరినీ కలుపుకొని పోతామని స్పష్టంచేశారు. మకు ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఎన్నికల సమయంలో, విస్తృత చర్చల అనంతరం తీసుకునే నిర్ణయమని చెప్పారు.
బీహార్ వెళ్లి మరీ అక్కడి అమర వీరుల కుటుంబాలకు.. సికింద్రాబాద్‌లో ప్రాణాలు కోల్పోయిన వలస కూలీల కుటుంబాలకు దాదాపుగా రూ. కోటి ఆర్థిక సాయం అందచేసిన కేసీఆర్.. తనతో పాటు కలసి వచ్చేలా నితీష్‌ను ఒప్పించలేకపోయారని.. ఆయన స్పందనను బట్టి అంచనా వేయవచ్చని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.