కాంగ్రెస్ నేతృత్వంలో యూపియే ప్రభుత్వం దేశాన్ని పదేళ్ళపాటి పాలించినపుడు రాహుల్ గాంధికి ప్రధానమంత్రి కుర్చీ రిజర్వ్ చేసి ఉంచినప్పటికీ ఆయన దానిలో కూర్చోవడానికి భయపడ్డారు. అదే ఆయన జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు అని చెప్పక తప్పదు. ఆ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోకపోవడం వలన ఆయన ఇంక ఎప్పటికీ ప్రధాని అయ్యే అవకాశాలు కోల్పోయినట్లే కనిపిస్తోంది. 2014 ఎన్నికలకు ముందు ఆయన ప్రధాని కుర్చీలో కూర్చోవడానికి ధైర్యం చేసినా అప్పటికే సమయం మించిపోయింది. ఎన్నికలలో యూపియే కూటమి ఓడిపోయింది. ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. మోడీ క్రమంగా భాజపాని దేశ వ్యాప్తంగా విస్తరింపజేస్తూ, ఆ ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఎసరు పెడుతున్నారు.
మరోవైపు బిహార్ లో మోడీకి కంగు తినిపించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ప్రధాన మంత్రి కలను నెరవేర్చుకోవడానికి ఇప్పటి నుండే పావులు కదపడం మొదలుపెడుతున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే తన నేతృత్వంలో దేశంలోని భాజపాయేతర పార్టీలన్నిటినీ ఏకం చేసి తృతీయకూటమిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు.
ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కూడా రాహుల్ గాంధి కంటే నితీష్ కుమార్ అన్నివిదాల ప్రధాన మంత్రి పదవికి అర్హుడని ప్రకటించేశారు. ఇప్పుడు తాజాగా మహారాష్ట్రకు చెందిన ఎన్.సి.పి. అధినేత శరద్ పవార్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసారు.
ఆయన పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడుతూ “ఒక రాష్ట్రంలో సమర్ధమయిన పాలన అందించినందుకు మోడీ ప్రధాని కాగలిగినప్పుడు, బిహార్ లో సమర్ధమయిన పాలనా అందిస్తున్న నితీష్ కుమార్ కూడా ప్రధానమంత్రి అవవచ్చు. బిహార్ ఎన్నికలలో నితీష్ కుమార్, లాలూ ఇద్దరూ కలిసి మతతత్వ భాజపాని ఓడించి తమ సత్తా చాటుకొన్నారు. కనుక భాజపాయేతర పార్టీలను ఏకం చేయాలనే ఆయన ప్రయత్నాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఇప్పుడు ఏదో ఒక రాజకీయ పార్టీ కేంద్రంలో అధికారం చేజిక్కించుకోగల పరిస్థితులు లేవు. జాతీయ పార్టీలకయినా ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరి. అటువంటప్పుడు నితీష్ కుమార్ నేతృత్వంలో తృతీయ కూటమి భాజపాకి ప్రత్యామ్నయంగా నిలిచే అవకాశం ఉంది. నా ఉద్దేశ్యంలో నితీష్ కుమార్ ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు రాహుల్ గాంధి కంటే అన్ని విధాల సమర్ధుడు యోగ్యుడు,” అని అన్నారు.
నితీష్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో ఇప్పుడే తెలియదు కానీ వాటికి సానుకూల స్పందన వస్తుండటం, రాహుల్ గాంధి రాజకీయ జీవితాన్ని ఇంకా ప్రశ్నార్ధకంగా మార్చి వేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఏనాటికయినా తన కొడుకుని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి ఆయన టీవిగా కాలు మీద కాలు వేసుకొని దేశాన్ని పాలిస్తుంటే చూడాలని తపించిపోతున్న ఆయన తల్లి సోనియా గాంధీకి ఇటువంటి మాటలు, పరిణామాలు జీర్ణించుకోవడం చాలా కష్టమే. మున్ముందు దేశంలో భాజపా పట్ల వ్యతిరేకత పెరిగినట్లయితే, ఏకైక ప్రత్యామ్నాయంగా కనబడుతున్న కాంగ్రెస్ పార్టీకే ప్రజలు అధికారం కట్టబెట్టక తప్పదు..అప్పుడు తన కొడుకు ప్రధానమంత్రి అవడం ఖాయం అనే ఆశతో జీవిస్తున్న సోనియా గాంధీకి, నితీష్ కుమార్ ఎదుగుదల ఆందోళన కలిగించవచ్చు. ఇప్పటికే మోడీ కారణంగా తన ముద్దుల కొడుకు రాహుల్ గాంధి రాజకీయ జీవితం, తన కలలు ప్రశ్నార్ధకంగా కనబడుతుంటే ఇప్పుడు నితీష్ కుమార్ కూడా పోటీగా అవతరిస్తున్నారు.
రాహుల్ గాంధి ప్రధాని కావాలని కాంగ్రెస్ పార్టీ నేతలు తప్ప వేరెవరూ కోరుకోవడం లేదు. వారిలో కూడా చాలా మంది ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ మున్ముందు దేశంలో భాజపా పట్ల వ్యతిరేకత పెరిగి అప్పుడు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే, మళ్ళీ వాటిపై సోనియా, రాహుల్ గాంధిల కర్ర పెత్తనం మొదలవుతుంది. దానిని భరించడం కంటే నితీష్ కుమార్ తో చేతులు కలిపితే అవి కూడా కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం దక్కుతుంది. ఉదాహరణకి ఒకవేళ తెదేపాతో భాజపా తెగతెంపులు చేసుకొన్నట్లయితే, అప్పుడు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ తోనే చేతులు కలపవచ్చు తప్ప కాంగ్రెస్ పార్టీతో కాదు. అలాగే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కాంగ్రెస్, భాజపాల కంటే నితీష్ కుమార్ వైపే మొగ్గు చూపవచ్చు. మిగిలిన రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడవచ్చు. కనుక రాహుల్ గాంధి రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి.