బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర తర్జనభర్జనలో ఉన్నారు. మిత్రపక్షమైన ఆర్జేడీతో దోస్తీ విషయమై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. లాలూతో ఫ్రెండ్ షిప్ కొనసాగిస్తే మరిన్ని విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుంది. అలాగని, తెంచుకుంటే ప్రభుత్వం పరిస్థితి ఏంటనేది కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది! ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని నితీష్ కలుసుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రపతి ప్రణబ్ గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నాడు ఢిల్లీలో ఓ విందు ఇచ్చారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్నీ ఆహ్వానించారు. ఈ విందుకు ఎన్డీయే మిత్రపక్షాలతోపాటు ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు కూడా హాజరు కాలేదు. కానీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ ఈ విందుకు వచ్చి అందర్నీ ఆశ్చర్యపరచారు.
ఆ తరువాత, రాహుల్ గాంధీ నివాసానికి నితీష్ వెళ్లారు. లాలుతో దోస్తీ కొనసాగింపు విషయమే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అవినీతి పరుడైన లాలుకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం సరికాదంటూ రాహుల్ దగ్గర నితీష్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. లాలూ కుమారుడు, తేజస్వీ యాదవ్ అంశం కూడా ఈ ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. ఆయనపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమౌతున్నాయనీ, ఈ తరుణంలో క్యాబినెట్ లో కొనసాగించడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. అయితే, ఈ చర్చలు ఎటూ తేలలేదనీ.. అభిప్రాయాలు కలబోసుకోవడానికే పరిమితమైందని కథనాలు వస్తున్నాయి.
ఈ మధ్యనే రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా భాజపావైపు కాస్త మొగ్గు చూపారు నితీష్ కుమార్. లాలూతో దోస్తీ కటీఫ్ చేసుకుని, ఎన్డీయేకు దగ్గరయ్యేందుకు నితీష్ సిద్ధంగా ఉన్నట్టు అనిపించింది. అయితే, సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జోక్యం చేసుకున్నారు. దాంతో నితీష్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ తరుణంలో నితీష్ తీవ్ర విమర్శలు పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు లాలూ కుమారుడుని ఉప ముఖ్యమంత్రిగా కొనసాగించడంపై కూడా చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, తేజస్వితో రాజీనామా చేయించే ప్రసక్తే లేదంటూ లాలూ భీష్మించుకుని కూర్చున్నారు. అలాగని, లాలూ కుమారుడుని కొనసాగిస్తే ‘అవినీతి రహిత ప్రభుత్వం నితీష్ది’ అనే ఇమేజ్ కు దెబ్బ పడుతుంది. మొత్తానికి, కాంగ్రెస్, జెడి (యు), ఆర్జేడీ మహా కూటమి ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్, ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పొచ్చు. లాలూ కుమారుడిని కొనసాగించలేక, రాజీనామా చేయించలేక తర్జభర్జన పడుతున్నారు.