ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ కేంద్రంలోని కూటమి సర్కార్ కు మెలిక పెట్టింది. బీహార్ కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నితీష్ కుమార్ నేతృత్వంలోని ఆ పార్టీ తీర్మానం చేసింది. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కొలువుదీరి ఇంకా నెల రోజులు కూడా కాలేదు అప్పుడే డిమాండ్ల పేరిట నితీష్ రాజకీయం మొదలు పెట్టడం సంచలనంగా మారింది.
శనివారం జేడీయూ జతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని లేదంటే, ప్రత్యేక ప్యాకేజీ అయినా ఇవ్వాలనే తీర్మానాన్నిఆ పార్టీ ఆమోదించింది. దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని గతంలోనే కేంద్రం స్పష్టం చేసినప్పటికీ బీహార్ కు స్పెషల్ స్టేటస్ లేదా స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలంటూ జేడీయూ తాజాగా డిమాండ్ చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
గతేడాది నవంబర్ లోనే ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఓ తీర్మానాన్ని బీహార్ కేబినెట్ ఆమోదించింది. ఆ సమయంలో ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో ఏర్పాటైన ప్రభుత్వానికి నాయకత్వం వహించిన నితీష్ కుమార్..ఈ ఏడాది జనవరిలోనే ఎన్డీయే గూటికి చేరుకున్నారు. ఈసారి సొంతంగా బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సంఖ్యా బలాన్ని పొందలేకపోవడంతో, ఎన్డీయే కూటమిలోని టీడీపీ, జేడీయూల మద్దతుతో కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కూటమిలో కీలకంగా ఉన్న జేడీయూ బీహార్ కు ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తడం ప్రాధాన్యత సంతరిచుకుంది.
స్పెషల్ స్టేటస్ ఇవ్వబోమని గతంలోనే తేల్చి చెప్పిన కేంద్రం బీహార్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు. కానీ ,స్పెషల్ ప్యాకేజీ ఇస్తే మాత్రం ఏపీని కూడా పరిగణనలోకి తీసుకోనుంది.