గత ఎన్నికలు మాదిరిగానే 2019లో కూడా మోడీ హవా మాత్రమే పార్టీని గెలిపిస్తుందన్న ధీమాలో ఇప్పటికీ భాజపా ఉంది! పరిస్థితులు ఒక్కోటిగా.. ఒక్కో రాష్ట్రంలో మారుతూ ఉన్నా వారి ధీమా వారిది అన్నట్టుగా ఉంటున్నారు. ఇప్పటికే సహజ మిత్రపక్షాలు ఒక్కోటిగా భాజపాకి దూరమౌతున్నాయి. ఏపీలో టీడీపీ, మహారాష్ట్రలో శివసేన వంటి పార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో భాజపాతో జతకట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు జేడీయూ కూడా అదే బాటలో పయనిస్తుండటం విశేషం! వచ్చే ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేయాలన్న ఉద్దేశం భాజపాకి లేకపోతే ఇబ్బందేం లేదనీ, కావాలంటే వారే సొంతంగా బీహార్ లో పోటీ చేసుకోవచ్చని నితీష్ కుమార్ స్పష్టం చేయడం విశేషమే.
కావాలంటే రాష్ట్రంలోని 40 స్థానాల్లో భాజపా పోటీ చేసినా ఎవరు వద్దంటారంటూ జేడీయూ అధికార ప్రతినిధి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలా చెబుతూనే.. సున్నితంగా ఓ సవాలు కూడా విసిరారు. అయితే, నితీష్ కుమార్ మద్దతు లేకుండా భాజపా ఇక్కడ గెలవడం సాధ్యం కాదనీ అన్నారు. వచ్చే ఏడాది జరగబోతున్న ఎన్నికలు గత ఎన్నికలు మాదిరిగా ఉండవనీ, రాజకీయాలు మారాయంటూ సంజయ్ అన్నారు.
అయితే, ఉన్నట్టుండి నితీష్ ఇలాంటి ప్రకటనలు ఎందుకు చేస్తున్నారంటే.. వచ్చే ఎన్నికల్లో తమకు ఎక్కువ లోక్ సభ స్థానాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు! ప్రస్తుతం బీహార్ లో ఉన్నది భాజపా సంకీర్ణ సర్కారే. కానీ, ఏరి కోరి భాజపాతో నితీష్ దోస్తీ చేసుకున్నా… ఆ తరువాత, నితీష్ అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. భాజపాకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రత్యేక హోదా కావాలన్నారు. మోడీతో విభేదిస్తుండటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఎక్కువ లోక్ సభ స్థానాలు తమకు దక్కాలన్న డిమాండ్ ను పరోక్షంగా మోడీ షా ముందుంచే ప్రయత్నంగా దీన్ని చూడొచ్చు.
నితీష్ తెగతెంపుల వ్యూహంగానూ ఈ డిమాండ్ ను చూడొచ్చు. ఎలా అంటే, దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేక హవా పెరుగుతున్న మాట వాస్తవమే. దీంతోపాటు, జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రెంట్ ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. అటువైపు కూడా నితీష్ ఆసక్తి లేదని చెప్పలేం. కాబట్టి, భాజపాతో తెగతెంపులు చేసుకోవాలంటే… ఇలాంటి గొంతెమ్మ కోరికలు వారి ముందు ఉంచడం ద్వారా… సమీప భవిష్యత్తులో చాలా ఈజీగా దూరం జరిగే అవకాశం ఉంటుంది కదా! అందుకే, భాజపాకి రుచించని లెక్కల్ని తెరమీదికి తెస్తున్నట్టుగా కూడా ఈ పరిస్థితిని చూడొచ్చు. ఏదేమైనా, మిత్రపక్షాల నుంచి భాజపాపై రానురానూ ఒత్తిడి పెరుగుతోందని చెప్పడానికి ఇది మరో సంకేతం అనడంలో సందేహం లేదు.