బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ కి ఎప్పటికయినా ప్రధానమంత్రి కావాలనే కోరిక బలంగా ఉంది. ఆ కారణం చేతనే, 2014 సార్వత్రిక ఎన్నికలకి ముందు నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా భాజపా ప్రకటించినందుకు నిరసనగా ఆయన ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేసారు. ఆ తరువాత అదే ప్రయత్నాలలో భాగంగా వామపక్షాలు, మమత, జయలలితలతో కలిసి ‘తృతీయ ఫ్రంట్’ ఏర్పాటుచేసారు. కానీ అది ఆరంభంలోనే కుప్పకూలింది. బిహార్ లో అనేక నాటకీయ రాజకీయ పరిణామాలు జరిగిన తరువాత నితీష్ కుమార్ మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగారు.
అయితే ఆయన లక్ష్యం బిహార్ కి ముఖ్యమంత్రి కావడం మాత్రమే కాదు దేశానికి ప్రధాని కావడం కూడా. కనుక ఆ దిశలో ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అందుకోసం ఆయన కూడా ఒకప్పుడు మోడీ అమలుచేసిన ఫార్ములానే అమలుచేస్తున్నట్లున్నారు. మోడీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేయడం ద్వారా తన సమర్ధత నిరూపించుకొని దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించినట్లే, నితీష్ కుమార్ కూడా బిహార్ రాష్ట్రాభివృద్ధి చేసి చూపించి తను కూడా ప్రధాని పదవి చేపట్టడానికి అన్ని విధాలా అర్హుడునని నిరూపించుకోవాలనుకొంటున్నారు. రాష్ట్రంలో మద్యనిషేదం ప్రకటించి దేశప్రజలందరి దృష్టిని ఆకర్షించగలిగారు.
జెడి (యు)కి పేరుకి శరత్ యాదవ్ అధ్యక్షుడుగా ఉంటున్నప్పటికీ, నితీష్ కుమారే పార్టీలో చక్రం తిప్పుతున్నారు. శరత్ యాదవ్ ఇప్పటికి వరుసగా మూడుసార్లు అధ్యక్షుడుగా పనిచేసిన ఆయన ఇంకా ఆ పదవిలో కొనసాగాలనుకోవడం లేదు. కనుక నితీష్ కుమార్ ని పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి పావులు కదుపుతున్నారు. ఇదే విషయంపై చర్చించడానికి ఆ పార్టీ జాతీయ మండలి ఆదివారం డిల్లీలో సమావేశం కాబోతోంది. దానిలో నితీష్ కుమార్ కి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఎవరూ చేయలేరు కనుక జెడి (యు) జాతీయ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక లాంచన ప్రాయమేనని భావించవచ్చును. దానితో ఆయన తన గమ్యం వైపు మరో అడుగు ముందుకు వేసినట్లుగానే భావించవచ్చును.
ఒకవైపు బిహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూడపడం ద్వారా తన సమర్ధతపై దేశ ప్రజలకు నమ్మకం కలిగించేలా చేస్తూనే, అదే సమయంలో దేశంలోని లౌకిక రాజకీయపార్టీలను మళ్ళీ ఏకం చేసి, వాటి మద్దతుతో వచ్చే ఎన్నికలలో నరేంద్ర మోడీకి సవాలు విసిరే అవకాశాలున్నాయి. ఆయన సమర్ధత, నీతి నిజాయితీ, నిష్కళంకమైన రాజకీయ జీవితం కారణంగా ఆమాద్మీ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఆయన నాయకత్వాన్ని అంగీకరించేందుకు ఇప్పటికే సిద్దంగా ఉన్నాయి. బిహార్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనతో చేతులు కలిపింది. రాహుల్ గాంధిని ప్రధానమంత్రి చేయాలనే ఆలోచనను కాంగ్రెస్ పార్టీ విరమించుకొన్నట్లయితే, అది కూడా ఆయన నాయకత్వాన్ని అంగీకరించవచ్చును. అంగీకరించకపోతే మోడీ చేతిలో మళ్ళీ ఎదురుదెబ్బ తిన్నట్లయితే, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్, దానితో బాటు రాహుల్ రాజకీయ జీవితం కూడా దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది కనుక ఎన్నికలు దగ్గర పడినప్పుడు తగిన నిర్ణయం తీసుకోవచ్చును.
ఇంక ఆంధ్రాలో తెదేపాతో భాజపా తెగతెంపులు చేసుకొనే మాటయితే చంద్రబాబు నాయుడు కూడా నితీష్ కుమార్ కి మద్దతు తెలపవచ్చును. అలాగే దేశంలో మోడీని, మతతత్వ భాజపాని వ్యతిరేకించే రాజకీయ పార్టీలన్నీ కూడా నితీష్ కుమార్ పక్షాన్న చేరవచ్చును. అదే జరిగితే వచ్చే ఎన్నికలలో నరేంద్ర మోడీకి ఎదురీత తప్పకపోవచ్చును. బహుశః అందుకే ఇప్పటి నుంచే నితీష్ కుమార్ ని తనవైపు త్రిప్పుకొని తనకు పోటీ లేకుండా చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే, ఒకప్పుడు ఆయనని చాలా తీవ్రంగా విమర్శించిన ప్రధాని నరేంద్ర మోడియే ఇటీవల బిహార్ పర్యటించినపుడు, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చాలా చక్కగా అమలవుతున్నాయని మెచ్చుకొన్నారేమో? ఏమో?