బీహార్ రాష్ట్రంలో లాలు ప్రసాద్ యాదవ్ అవినీతికి ప్రతిరూపంగా పేరు సంపాదించుకొంటే, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంచి పరిపాలనాదక్షుడు, సమర్ధుడు, నీతివంతుడుగా పేరు తెచ్చుకొన్నారు. పూర్తి భిన్నమయిన వ్యక్తిత్వాలు, ఆలోచనలు కలిగిన వారిరువురూ నరేంద్ర మోడి నుండి ఎదురయ్యే పోటీని తట్టుకొని బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచేందుకు చేతులు కలిపారు. అవినీతి మరకలు అంటుకొన్న కాంగ్రెస్ పార్టీ కూడా వారితో కలిసింది. సోమవారం మొదటి దశ ఎన్నికలు జరుగుతాయి. కానీ మొదటి దశ ఎన్నికలు జరుగక ముందే, అన్ని సర్వే నివేదికలలో బీహార్ లో బీజేపీయే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పాయి.
నిజానికి బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ తో సరితూగగల నాయకుడు బీజేపీకి లేడు. మోడీ, అమిత్ షా తదితరులు ఎంతగా గొప్పగా ప్రచారం చేసినా వారు స్వయంగా రాష్ట్రాన్ని పరిపాలించలేరు. కనుక ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలి. అందువలన బీహార్ ప్రజలు సహజంగానే సమర్దుడయిన నితీష్ కుమార్ వైపే మొగ్గు చూపాలి. కానీ వారు ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని నివేదికలు చెపుతున్నాయి. ఎందుకు? అని ప్రశ్నించుకొంటే, నితీష్ కుమార్ కి ఎంత మంచి పేరున్నప్పటికీ ఆయన లాలూ ప్రసాద్ వంటి అవినీతిపరునితో చేతులు కలిపినందునేనని భావించవచ్చును. ఒకవేళ నితీష్ కుమార్ ఒంటరిగా పోటీ చేసి ఉండి ఉంటే తప్పకుండా విజయం సాధించి ఉండేవారేమో? లేకుంటే ఎన్నికల తరువాత అవసరం పడితే లాలూ ప్రసాద్ మద్దతు స్వీకరించినా నితీష్ కుమార్ మళ్ళీ అధికారం చేజిక్కించుకొనే అవకాశం ఉండేది.
కానీ గడ్డి కుంభకోణం కేసులో దోషిగా నిర్దారింపబడి నాలుగేళ్ళ జైలు శిక్షపడినందున ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటింపబడిన లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలపడమే కాకుండా అతనికి తనతో సరిసమానంగా వంద సీట్లు పంచిఇవ్వడం మరొక పెద్ద పొరపాటని చెప్పవచ్చును. అనర్హత వేటు పడిన కారణంగా లాలూ ప్రసాద్ కి ఏ పదవీ చేపట్టడానికి అవకాశం లేదు. కానీ ఆయన పార్టీ అభ్యర్ధులు (అందులో ఇద్దరు ఆయన కొడుకులు కూడా ఉన్నారు) వంద స్థానాలలో పోటీ చేస్తునందున ఒకవేళ వారిలో ఎక్కువ మంది ఎన్నికలలో విజయం సాధించినట్లయితే అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ వెనుక సీటులో కూర్చొని ప్రభుత్వాన్ని నడిపించే ప్రయత్నం తప్పక చేస్తారు. అందుకే నితీష్ కుమార్ కి ఓటేసి గెలిపిస్తే దొడ్డిదారి గుండా అధికారం చేజిక్కించుకొన్న లాలూ ప్రసాద్ మళ్ళీ బీహార్ రాష్ట్రాన్ని ఆటవిక రాజ్యంగా మార్చేస్తారని, నితీష్ ప్రభుత్వాన్ని రిమోట్ తో నడిపిస్తాడని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల మనస్సులో బలంగా నాటుకుపోయేలా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. అది నిజం కూడా. ఆ కారణంగానే బీహార్ ప్రజలలో నితీష్ కుమార్ కి ఎంత మంచి పేరున్నపటికీ ఎన్నికలలో నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి.
అయితే దీనికి మంచి పరిష్కారం కూడా ఉంది. నితీష్ కుమార్ ఈ పరిస్థితుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ని వదిలించుకోవడం కొంచెం కష్టమే కానీ అసాధ్యం కాదు. కనుక ఇప్పటికయినా ఆయన లాలూతో (ఏదో గిల్లికజ్జా పెట్టుకొని) తెగతెంపులు చేసుకోగలిగితే, ఆయన విజయావకాశాలు చాలా మెరుగవవచ్చును. బీహార్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మిగిలిన నాలుగు దశల పోలింగులో నామినేషన్లు వేయడానికి ఇంకా అవకాశం ఉంది కనుక మరో 50 స్థానాల నుండి తన స్వంత పార్టీ అభ్యర్ధులనే నితీష్ కుమార్ నిలబెట్టుకొన్నట్లయితే బీహార్ ప్రజలు మళ్ళీ ఆయనకే ఓటు వేయవచ్చును.
జనతాపరివార్ కి సుమారు 106 సీట్లు వరకు రావచ్చని అన్ని సర్వేలు చెపుతున్నాయి. వాటిలో అత్యధిక శాతం నితీష్ కుమార్ పార్టీ అభ్యర్ధులవే అయ్యి ఉంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చును. మిగిలినవాటిలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావచ్చును. కనుక నితీష్ కుమార్ ఇప్పటికయినా మేల్కొని లాలూ ప్రసాద్ యాదవ్ ని వదిలించుకొంటే మంచిది. లేకుంటే “సహేంద్ర తక్షకాయిస్వాహ” అన్నట్లు లాలూతో బాటు నితీష్ కూడా మునగడం తధ్యం.