ప్రత్యేకహోదా కోసం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉద్యమం.. బీజేపీ కుర్చీ కిందకు నీళ్లు తెచ్చినంత పని చేసింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందో..అప్పటి నుంచి బీజేపీకి గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా… మరో ప్రత్యేకహోదా ఉద్యమం ..మోదీకి గట్టిగా తగిలే సూచనలే కనిపిస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. నరేంద్రమోదీకి వ్యతిరేకంగా మెల్లగా గళమెత్తుతున్నారు. మూడు రోజుల కిందట నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించిన ఆయన.. బీహార్‌కు ప్రత్యేకహోదా అంశాన్ని ఈ సారి బలంగా తెరపైకి తెచ్చారు.
బీహార్‌కు ప్రత్యేకహోదా డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. కానీ… బీహార్ సీఎం దాన్ని రాజకీయంగా తనకు అవసరమైనప్పుడే బయటకు తీస్తూంటారు. అందుకే బీజేపీ నేతల్లో టెన్షన్ ప్రారంభమయింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఒకప్పుడు ప్రశంసించిన నితీష్… ఇప్పుడు అదో పెద్ద స్కాం అన్నట్లు మాట్లాడుతున్నారు. సడన్ గా యూ టర్న్ తీసుకుని మోదీ సర్కారును నిలదీయడంతో బీజేపీ ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నించింది. ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా ప్రత్యేక హోదా అంశాన్ని బయటకు తీశారు. 18 ఏళ్ల క్రితం బీహార్‌ను విభజించి… జార్ఖండ్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి పునర్ విభజన చట్టంలో ప్రత్యేకహోదా ఉందని… బీహార్‌కు దాన్ని ఇంకా ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. నాటి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి పర్యవేక్షణలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే బీహార్ ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేదని నితీశ్ అంటున్నారు. ఇప్పుడు నీతి ఆయోగ్ పర్యవేక్షణలో అలాంటి సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నితీష్ డిమాండ్లన్నీ రాజకీయంతో కూడినవని బీజేపీ అనుమానిస్తోంది. నితీష్ మొదట బీజేపీతోనే పొత్తు లో ఉండేవారు. కానీ మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో.. ఆయన తీవ్రంగా వ్యతిరేకించి.. పొత్తు వదిలేసుకున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల నాటికి… లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీతో జతకట్టి…ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో నితీష్ పార్టీ జేడీయూ కన్నా… ఆర్జేడీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. అయినా ముందు ఇచ్చిన మాట ప్రకారం..నితీష్ నే సీఎం చేశారు లాలూ. తర్వాత మోదీ ప్రభంజనం బాగా ఉందన్న భావనతోనో.. మోదీతో ఏర్పడిన సన్నిహిత సంబంధాల వల్లనో కానీ.. లాలూపై అవినీతి ఆరోపణలు సాకుగా చూపి ఆర్జేడీకి కటిఫ్ చెప్పి.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీష్. కానీ ఇప్పుడు మోదీ ప్రభ వేగంగా తగ్గిపోతూండటంతో ఆయన ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి బీజేపీ బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ పడినప్పుడు.. ఆ రాష్ట్రానికి ప్రధాని మోదీ లక్షా 65 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. అయినా సరే ఎన్నికల్లో ఓడిపోయారు. అన్నీ మాటలే కానీ.. ఒక్క రూపాయి కూడా బీహార్‌కు మోదీ ఇవ్వలేదని..నితీష్ గతంలో ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకొస్తున్న సమయంలో… ఇప్పుడు మళ్లీ నితీష్.. బీజేపీని భయపెట్టేలా రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. లాలూ పెద్ద కొడుకు తేజ్ దీప్ పెళ్లికి పిలిచిందే తడవుగా నితీశ్ వెళ్లి ఆశీర్వదించి వచ్చారు. మొత్తానికి భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకహోదా గండం ఏదో ఉన్నట్లుందని ఏపీ, బీహార్ పరిణామాలను చూస్తున్న వారు అంచనా వేస్తున్నారు.