హైదరాబాద్: 2014 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, 2014 పార్లమెంట్ ఎన్నికలలో నరేంద్ర మోడి విజయంలో, 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ విజయంలో కీలక పాత్ర పోషించిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు క్యాబినెట్ మంత్రి హోదా దక్కింది. అతనిని ముఖ్యమంత్రికి సలహాదారుగా నియమిస్తున్నట్లు నితీష్ ప్రభుత్వం ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. 2014 ఎన్నికల తర్వాత నరేంద్రమోడి-అమిత్ షా బృందంతో విభేదాలు రావటంతో బయటకొచ్చేసిన ప్రశాంత్ కిషోర్ నితీష్‌తో చేతులు కలిపారు. బీహార్‌లోని బక్సర్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్, ఆఫ్రికాలో ఐక్యరాజ్యసమితి హెల్త్ ఎక్స్‌పర్ట్‌గా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి 2011లో భారత్ తిరిగొచ్చారు. కొంతమంది మిత్రులతో కలిసి సిటిజన్స్ ఫర్ ఎకౌంటబుల్ గవర్నెన్స్ అనే సంస్థను స్థాపించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. 2017లో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకోసం ప్రశాంత్‌ను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. వీరిద్దరి మధ్య దాదాపుగా ఒప్పందం కుదిరినట్లేనని కాంగ్రెస్ వర్గాల కథనం.