వచ్చే ఎన్నికల్లో మోదీని మట్టి కరిపించి… తామే పీఠం ఎక్కాలని ఆశపడని విపక్ష సీనియర్లకు లెక్క లేదు. అయితే ఆశపడుతున్న వారు చాలా మంది ఇంకా రంగంలోకి దిగలేదు. వారికి వివిధ పరిస్థితులు అడ్డంకిగా కనిపిస్తున్నాయి . బీహార్ సీఎం నితీష్ కుమార్ మాత్రం ఇప్పుడు రంగంలోకి దిగారు. వరుసగా అందర్నీ కలుస్తున్నారు. విపక్షాలన్నీ కలిసి పోటీ చేసేలా ఆయన ఒప్పిస్తున్నారు. బీజేపీకి పోటీగా విపక్షాల నుంచి ఒక్క అభ్యర్థి ఉండేలా చూసుకుందమని ఆయన ఒప్పిస్తున్నారు. ఆయా నియోజవకర్గాల్లో ఎవరు బలంగా ఉంటే వారు పోటీచేసేలా ఒప్పిస్తున్నారు.
నితీష్ కుమార్ దాదాపుగా అందరితో అంగీకారం తీసుకుంటున్నారు. కానీ బీజేపీని ఓడించాలన్న పట్టుదలతో ఉన్న కొన్ని పార్టీలు.. మాత్రం…ఇంకా తమ సొంత పోరాటం అంటున్నారు. అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ ఇప్పటికే సొంత కూటమి గురించి ప్రకటించారు. త్వరలో కేసీఆర్తో సమావేశం అవుతామని.. అఖిలేష్ చెప్పారు. కేసీఆర్ మాత్రం జాతీయరాజకీయాల గురించి విస్తృతంగా మాట్లాడుతున్నారు. ఆయన మాటలు ప్రగతి భవన్ దాటడం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో అధికారం బీఆర్ఎస్దే అంటున్నారు.
మహారాష్ట్రలో ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చేసిన కింది స్థాయి నేతల్ని చేర్చుకుంటూ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పా టు చేస్తామనే ప్రకటనలు చేస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో కానీ కేసీఆర్ కాన్ఫిడెన్స్ చూసి… బీఆర్ఎస్ నేతలకు మైండ్ బ్లాంక్ అవుతోంది. అసలు జాతీయ పార్టీ ప్రకటించిన తర్వాత పెద్దగా కార్యక్రమాలు చేపట్టకుండా ప్రగతిభవన్ నుంచి అరుదుగా మాత్రమే బయటకు వస్తే ఎలా స్వప్నం సాకారం అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు నితీష్ కుమార్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆ బాధ్యతల్ని కేసీఆరే తీసుకోవాల్సి ఉందన్న అభిప్రాయం ఆ నేతల్లో వినిపిస్తోంది. కేసీఆర్ ఇలా అందర్నీ ఏకం చేస్తేనే.. ఢిల్లీ పీఠం చేరువ అవుతుందంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఇంకా రంగంలోకి దిగడం లేదు.