ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన నితీష్ కుమార్ నవంబర్ 20న బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. పాట్నాలోని గాంధీ మైదానంలో మధ్యాహ్నం 2గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం జరుగబోతుంది. నితీష్ కుమార్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడికి ఫోన్ చేసి ఆహ్వానించారు. కానీ ఆయనకు ఆరోజు వేరే ఇతర కార్యక్రమాలు ఉన్నందున కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, రాజీవ్ ప్రతాప్ రూడి కేంద్రప్రభుత్వం తరపున హాజరయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు సంజయ్ మయుక్ చెప్పారు. నితీష్ కుమార్ విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్, హోం మంత్రి రాజ్ నాద్ సింగ్, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. కానీ వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవచ్చునని సంజయ్ మయుక్ చెప్పారు. ఈ కార్యక్రమానికి డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గగొయ్ హాజరయ్యే అవకాశం ఉంది. మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా బిహార్ ప్రభుత్వంలో భాగస్వామి కాబోతోంది కనుక ఈ కార్యక్రమానికి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.