కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది ప్రధాని నరేంద్ర మోడీ నినాదం. దానికి ఇంతకాలానికి ఓ ఘాటు కౌంటర్ వినపడుతోంది. అదే, సంఘ్ ముక్త్ భారత్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొత్త నినాదం ఇదే. ఆరెస్సెస్ తో పాటు బీజేపీ లేని భారత్ ను సాధించాలనేది ఆయన లక్ష్యమట. అందుకోసం బీజేపీయేతర పార్టీలన్ని ఏకతాటిపైకి రావాలట. మరో మాటలో చెప్పాలంటే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నన్ను ప్రధాని అభ్యర్థిని చేయడానికి అన్ని ప్రతిపక్షాలూ ముందుకు రావాలనేది అంతరార్థం అని స్పష్టమవుతోంది.
బీజేపీతో దాదాపు రెండు దశాబ్దాల స్నేహ బంధాన్ని 2014 ఎన్నికలకు ముందు నితీష్ తెగతెంపులు చేసుకోవడానికి కారణం, మోడీని ప్రధాని అభ్యర్థిగా నిర్ణయించడం. అయితే, ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకుని ప్రధాని పదవికి బాటలు వేసుకునే ప్రయత్నంలో మాత్రం మోడీయే ఆదర్శమని తెలుస్తూనే ఉంది.
గత ఏడాది బీహార్ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన తర్వాత నితీష్ లో ఆత్మ విశ్వాసం పెరిగింది. మోడీ ఎంత ముమ్మరంగా ప్రచారం చేసినా బీహార్లో ఫలితం లేకపోయింది. అలాగే యూపీలో, చివరకు దేశ వ్యాప్తంగా మోడీకి చెక్ పెట్టాలనేది నితీష్ ప్లాన్ కావచ్చు. అందుకు తన పార్టీ బలం సరిపోదు. బీహార్ దాటితే జేడీయూ అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఇతర పార్టీల మద్దతు కూడగట్టడానికి స్కెచ్ వేసినట్టున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి స్థాయి పొందాలంటే ఈ మూడేళ్లూ చాలా కష్టపడాలి. అందుకే నితీష్ పావులు కదపడం మొదలుపెట్టారు. అయితే ఆయన ప్రయత్నం ఫలిస్తుందా అనే దానిపై చాలా అనుమానాలన్నాయి. కనీసం జనతా పరివార్ విలీనానికి ఆయన చేసిన ప్రయత్నం విఫలమైంది. ములాయం సింగ్ యాదవ్ ఆ ప్రయత్నాన్ని విఫలం చేశారని నితీష్ బృందం బాధపడింది. ములాయం తానే ప్రధాని కావాలని భావిస్తున్నారు. మాయావతి కూడా ప్రధాని కావాలనే లక్ష్యంతో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ సేమ్ డిటో. వీళ్లంతా నితీష్ ను ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకుంటారా అనేది ప్రశ్న.
బీహార్లో పరిస్థితి బాగాలేదు కాబట్టి నితీష్ చాటు పార్టీగా కాంగ్రెస్ నెట్టుకొస్తోంది. జాతీయ స్థాయిలో కూడా ఆయన్ని నేతగా ఒప్పుకుంటుందా? మరి రాహుల్ గాంధీ పరిస్థితి ఏమిటి? ఈ కోణంలో చూసినప్పుడు కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ ప్రధానిని చేయడానికే ప్రయత్నిస్తుంది. అలాంటప్పుడు నితీష్ కు ఎంత మంది మద్దతిస్తారు, వాళ్లకు వచ్చే సీట్లు ఎన్ని అనేది అంతుచిక్కని విషయం. మొత్తం మీద నితీష్ ప్రయత్నం సఫలం కంటే విఫలం అయ్యే అవకాశాలే ఎక్కువ అంటున్నారు పరిశీలకులు.