నాని నటించిన జెంటిల్మెన్ తో టాలీవుడ్లో అడుగుపెట్టింది నివేథా థామస్. ఆ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా.. నివేదాకు ఘనమైన ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు నానితోనే మరో సినిమా చేస్తోంది. ఈలోగా సూపర్ డూపర్ ఆఫర్ అందుకొంది. ఎన్టీఆర్తో జోడీ కట్టే ఛాన్స్ వరించింది. ఎన్టీఆర్ – బాబి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కథానాయికగా నివేదా ఎంపికైంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో త్రిపాత్రాభినం చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు పాత్రలకు గానూ.. ముగ్గురు హీరోయిన్లు కావాలి. ఓ కథానాయికగా రాశీఖన్నా ఎంపికైంది. మరో నాయిక పాత్రకు అనుపమ పరమేశ్వరన్ పేరు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు మూడో కథానాయికగా నివేదాని తీసుకొన్నారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 15 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ యేడాది ఆగస్టు నాటికి సినిమాని సిద్ధం చేయాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఈ చిత్రానికి జై లవకుశ అనే పేరు పరిశీలిస్తున్నారు. మూడు పాత్రల్లో ఓ పాత్రకు నెగిటీవ్ ఛాయలుంటాయని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందింస్తారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.