లేడీ అమితాబ్ అనగానే విజయశాంతి గుర్తొస్తుంది. ఇక నుంచి లేడీ విజయ్ సేతుపతి అంటే… నివేదా పేతురాజ్ గుర్తుకురావాలట. నివేదా.. లక్ష్యం అదే అంటోంది. తెలుగులో ఈమధ్య బాగా వినిపిస్తున్న పేరు… నివేదా పేతురాజ్. కథానాయికగా నటిస్తూనే, కొన్ని కొన్ని చిత్రాల్లో కీలకమైన పాత్రలు చేస్తోంది. తాజాగా `రెడ్` సినిమాలో నటిస్తోంది. హీరోయిన్గా నటిస్తూ, గెస్ట్ రోల్స్ చేయడం ఏమిటి? అని అడిగితే… `విజయ్ సేతుపతి`ని ఉదాహరణగా చూపిస్తోంది నివేదా.
“విజయ్ సేతుపతిని చూడండి. ఆయన హీరోగా పెద్ద స్టార్. కానీ.. పాత్ర నచ్చితే ఎలాంటి సినిమాలో అయినా, ఎలాంటి పాత్రలో అయినా చేస్తారు. నేనూ అంతే. నాకైతే లేడీ విజయ్‌సేతుపతి అనే పేరు తెచ్చుకోవాలనివుంది. `అల వైకుంటపురములో` నేను చేసింది చిన్న పాత్రే. ఆ సినిమా ఎంత గొప్ప విజయం సాధించిందో చూడండి. అందులో నటించిన వాళ్లందరికీ మంచి పేరొచ్చింది. నాకు కావల్సింది కూడా అదే” అని చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో కూడా ఇదే పంథా కొనసాగిస్తా.. అని చెప్పుకొచ్చింది నివేదా. మరి తన కల నెరవేరుతుందో, లేదో చూడాలి.