నిన్న.. అంటే సోమవారం నివేదా ధామస్ తన `ఎక్స్` ఖాతాలో చేసిన ఓ పోస్ట్ కాస్త కలవరం రేపింది. ”ఎన్నో రోజుల తరవాత.. ఫైనల్లీ…” అంటూ ఓ లవ్ సింబల్ జోడించిన సందేశం ఎన్నో సందేహాల్ని రేకెత్తించింది. నివేదా పెళ్లి చేసుకోబోతోందా? ఎంగేజ్మెంట్ వార్త… ఇలా అభిమానులకు చేరవేసిందా? కాబోయే భర్త ఎవరో? అంటూ ఆసక్తిగా చర్చించుకొన్నారు. అయితే ఇదంతా తన కొత్త సినిమా కోసం చేసిన పబ్లిసిటీ స్టంట్ అని ఈ రోజు అర్థమైంది. నివేదా కొత్త సినిమా ’35 – ఇది చిన్న కథ కాదు’ అధికారిక ప్రకటన ఈరోజు విడుదలైంది. అందుకోసమే నిన్న నివేదా అంత హడావుడి చేసిందన్నమాట.
ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. ఆగస్టు 15న విడుదల చేస్తున్నారు. పెళ్లి నేపథ్యంలో సాగే సినిమా ఇది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. రానా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. నందకిషోర్ దర్శకుడు. ”ఇలాంటి మంచి స్క్రిప్ట్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. మొత్తానికి దొరికింది” అంటూ నివేదా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకొంది.