ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎలాగైనా బోణి కొట్టాలని భారతీయ జనతా పార్టీ కసరత్తులు చేస్తోంది. ఖాతా తెరవాలనే సంకల్పంతో గట్టి అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పార్టీతోపాటు ఆశావహుల బలాబలాలపై అభిప్రాయాలు సేకరించింది. నోటిఫికేషన్ విడుదల తర్వాత మరోమారు జిల్లా పదాధికారులతో సమావేశం నిర్వహించి అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కామారెడ్డి, నిజామాబాద్ గ్రామీణం, బోధన్నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కి వచ్చింది.
నిజామాబాద్ అర్బన్‌లో ముగ్గురు ఆశావహులు టికెట్‌కోసం పోటీపడుతున్నారు. ఎవరికి వారే తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అభివృద్ధికి చేసిన సేవలను రాష్ట్ర నేతలకు వివరిస్తున్నారు. దీంతో పాటు క్షేత్రస్థాయిలోని కార్యకర్తల అభిప్రాయాలు, బలాబలాలను చేరవేస్తున్నారు. ఆర్మూర్‌లో ఇటీవల పార్టీలో చేరిన నేతకు టికెట్ కేటాయించనున్నారు. బాల్కొండలో ప్రధాన పార్టీల్లోని అసమ్మతి నేతలను ఆహ్వానించి టిక్కెట్ ఇవ్వాలనుకుంటున్నారు ఎల్లారెడ్డి నుంచి ఎన్ఆర్ఐని బరిలోకి దించేందుకు ఏర్పాట్లు చేశారు.
అభ్యర్థుల ఎంపిక కోసం నియమించిన ఎన్నికల కమిటీ సభ్యులు రెండు రోజులుపాటు ప్రతి నియోజకవర్గంలో పార్టీ మండల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఆపై స్థాయి నేతల నుంచి అభిప్రాయాలను సేకరించారు. తొమ్మిది నియోజకవర్గాల్లోని కార్యకర్తల నుంచి గురువారం పార్టీ ఎన్నికల కమిటీ సభ్యులు పార్టీ పరిస్థితి? అభ్యర్థి ఎవరు అయితే విజయావకాశాలు ఉంటాయి? అని అడిగి తెలుసుకున్నారు. పార్టీ నిర్దేశించిన అభ్యర్థుల విజయానికి తీసుకోవల్సిన చర్యలను వివరించారు. టికెట్ ఆశిస్తున్న ఆశావహులు సమష్టిగా ఈ నెల 20 వరకు నియోజకవర్గస్థాయిలో రెండుసార్లు సమావేశాలు నిర్వహించాలని నేతలు నిర్దేశించారు. ఇటీవల కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువతకు భాజపా సిద్ధాంతాలు, మోదీ పాలన తీరును వివరించి, వారు పార్టీలో సభ్యులుగా చేరేలా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు, మహిళలతో సమావేశం కావాలని సూచించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారని రాష్ట్ర నాయకులు వివరించారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి కావల్సిన ప్రచార వ్యూహాలను సిద్ధం చేయడంతో పాటు ప్రచారానికి జాతీయస్థాయి నేతలు వస్తారని కార్యకర్తలకు భరోసా కల్పించారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.
ముందస్తు ఎన్నికల్లో ఎలాగైనా ఉమ్మడి జిల్లాలో పాగా వేయాలనే సంకల్పంతోనే రాష్ట్ర నాయకత్వం పార్టీ అభ్యర్థుల ఎంపికపై జాప్యం చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా తెరాస, కాంగ్రెస్‌లలో టికెట్‌రాక అసంతృప్తిగా ఉన్నవారిని పార్టీలోకి ఆహ్వానించి టికెట్ కేటాయించాలని చూస్తున్నారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌నుంచి పలువురు ఆశావహులు టికెట్‌కోసం పోటీపడుతున్నారు. ఇలాంటి వారిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. సొంత బలం కన్నా…ఇతర నేతలపైనే.. నిజామాబాద్‌లో బీజేపీ ఎక్కువ ఆధారపడుతోంది.