నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక.. దేశంలో అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం కనిపిస్తోంది. నిజామాబాద్ ఎంపీ స్థానానికి దాదాపు 190 మంది రైతులు నామినేషన్లు వేశారు. వీరు అందరూ బరిలో నిలిచే అవకాశం ఉంది. సాధారణంగా ఒక ఈవీఎంలో 16మంది అభ్యర్థుల పేర్లు, వారి గుర్తులను ఇచ్చేందుకు అవకాశం ఉంది. 16కంటే ఎక్కువమంది అభ్యర్థులు బరిలో ఉంటే రెండో ఈవీఎంను కంట్రోల్ యూనిట్‌కు జత చేస్తారు. నిజామాబాద్‌లో బరిలో నిలిచిన 190మంది అభ్యర్థులు ఉన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నియోజకవర్గంలో ఎన్నిక నిర్వహించాలా? వద్దా? అన్నదానిపై అధికారులు చర్చిస్తారు. బ్యాలెట్ల ముద్రణకు పట్టే సమయం, అభ్యర్థులు కేటాయించాల్సిన గుర్తులు, ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆ బ్యాలెట్ పత్రాలను భద్ర పరిచేందుకు కావాల్సిన బాక్సులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
1996 లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి 480మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. దీంతో ఎన్నికల సంఘం ఆ అభ్యర్థులు, వారి గుర్తులతో కూడిన 50పేజీల బుక్‌లెట్‌ను ముద్రించింది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికమంది అభ్యర్థులు పోటీ చేసిన సందర్భం అదే. నిజామాబాద్ రైతులందరూ.. తమ సమస్యలు.. దేశం దృష్టికి తీసుకెళ్లడానికే ఈ విధంగా నామినేషన్లు వేశారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు ప్రతీ ఏడాది మద్దతు ధర లభించదు. వారు ఆందోళన చేస్తూనే ఉంటారు. కానీ ప్రభుత్వం పట్టించుకున్న సందర్భాలు లేవు. తెలంగాణ సర్కార్ పై ఈ విషయంలో… మండి పడిన రైతు సంఘాలు వినూత్న కార్యాచరణతో నిరసన తెలుపుతున్నారు.
దానిలో భాగంగానే.. ఇప్పుడు నామినేషన్లు వేశారు. ఈ విషయం తెలిసి.. సిట్టింగ్ ఎంపీ కవిత… సమస్య అంతా… మోడీ దగ్గరే ఉందని.. ఆయన నియోజకవర్గంలో నామినేషన్లు వేద్దామని పిలుపునిచ్చారు. కానీ.. రైతులు మాత్రం నిజామాబాద్‌లోనే వేశారు. రైతుబంధు పథకంతో… రైతుల్ని రాజుల్ని చేశామని చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వానికి ఇది ఇబ్బందికర పరిణామమే.