తెలంగాణ రాజకీయం వేడి మీద ఉంది. మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ఇది అసహనం స్థాయికి వెళ్లిపోతోంది. దాడులకు కారణం అవుతున్నాయి. తాజాగా వరద సహాయ కార్యక్రమాల పరిశీలనకు వెళ్తున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై దాడి జరిగింది. ఇలా ఓ ఎంపీపై సామాన్యులు ఎవరు దాడి చేయరు. రాజకీయ ప్రోద్భలంతోనే దాడి జరుగుతుంది. ఆయనపై దాడి జరిగిన తర్వాత అమిత్ షా ఫోన్ చేసి అర్వింద్‌తో మాట్లాారు. దీంతో ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చేసింది.
వాన, వరదలతో ఇబ్బంది పడుతున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి గ్రామానికి వెళ్లారు ఎంపీ అర్వింద్. ఆయనపై దాడికి దిగారు కొందరు. చెప్పుల దండని వేయడానికి ప్రయత్నించారు. కాన్వాయ్ ని అడ్డుకొని అద్దాలు పగలకొట్టారు. క్షణంలో అంతా జరిగిపోయింది. పోలీసుల అడ్డుకోవడంతో ఎంపీ అక్కడి నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఎంపీపై దాడి జరగడం ఇది మొదటిసారి కాదు గతంలో కూడా జరిగాయి. ఎంపీపై జరిగిన దాడి వెనక టీఆర్ఎస్ కుట్ర ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డితనపై దాడులకు కుట్ర చేస్తున్నారనేది అర్వింద్ అనుమానం.
అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం మీ పార్టీ , మీ నేతలపై ప్రజల్లో కోపం ఉందని అందుకే దాడులు చేస్తున్నారని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలా దాడులు చేసేందుకు ప్రజలు ఎవరూ ముందుకు రారు. అది అందరికీ తెలిసిన విషయం. ఇలా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ పోతే పరిస్థితి విషమిస్తుంది. ధర్మపురి అర్వింద్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తారు. దానికి దాడులతో కౌంటర్ ఇస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఈ రాజకీయ అసహనం ఎక్కడి వరకూ వెళ్తుందో చెప్పడం కష్టం.