ఏపీ పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల్ని హైకోర్టు కొట్టి వేసింది. ఒకటి నారా లోకేష్‌పై నమోదు చేసిన కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు కాగా.. మరొకటి సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసు. తనపై సీఐడీ అధికారులు తప్పుడు కేసు పెట్టారని అంకబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు అంకబాబు వాదనను సమర్థించి కేసును కొట్టి వేసింది. తప్పుడు కేసు పెట్టిన సీఐడీపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ?
అంకబాబు వయసు 73 ఏళ్లు. విజయవాడ ఎయిర్ పోర్టులో బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో ఓ దినపత్రికలో వచ్చిన వార్తను ఓ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశారు. అదే ఆయన చేసిన నేరం. కేసులు పెట్టడమే కాదు.. ఆయన ఇంటి గోడలు దూకి దాదాపుగా పది మందిసీఐడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.బట్టలు వేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. నోటీసులు కూడా ఇవ్వకుండా.. వయసు పరంగా వృద్ధుడైన వ్యక్తితో సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
నిజంగా తప్పు చేసి ఉంటే అనుకోవచ్చు.. కానీ ఉద్దేశపూర్వకంగా.. కక్ష సాధింపు కోసమే.. ఆయన ప్రభుత్వ పెద్దలకు ఇష్టం లేని సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఏదో ఒకటి చేయాలన్న దుర్బుద్దితోనే అరెస్ట్ చేశారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కేసు తప్పుడదని అర్థమైపోయింది. మరి ఆయనను మానసికంగా క్షోభ పెట్టిన సీఐడీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? ప్రైవేటు కేసులు పెట్టి.బాధితులే పోరాడాలా లేకపోతే… మరోసారి ఇలాంటి వారు బాధితులు కాకుండా.. వ్యవస్థే ఏమైనా చర్యలు తీసుకుంటుందా ?