ఎంత కామెడీ సినిమా అయినా సరే, ఫైటింగులు ఉండాల్సిందే. అందుకే… నరేష్ కూడా.. సిక్స్‌ప్యాక్ (సిగరెట్ ప్యాకెట్స్) వేసుకుని కామెడీగా ఫైటింగులు చేస్తుంటాడు. ఇక సునీల్ అయితే చెప్పక్కర్లేదు. నిజంగానే సిక్స్ ప్యాకులతో దడదడలాడించేశాడు. ఫైట్లు లేని సినిమాలు మరీ అరుదుగా వస్తుంటాయి. వెంకటేష్, వరుణ్‌తేజ్ `ఎఫ్ 2`లో కూడా ఒక్క ఫైటు కూడా లేదట. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఇప్పటి వరకూ తీసిన మూడు సినిమాల్లోనూ ఫైట్లతో హోరెత్తించాడు అనిల్ రావిపూడి. అందులో కొన్ని వెరైటీ ఫైట్లున్నాయి. ఈసారి మాత్రం… ‘నో ఫైట్స్.. ఓన్లీ కామెడీ’ అన్న ట్యాగ్‌తో ఈ సినిమాని పూర్తి చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ ఆల్బమ్‌లోని తొలిపాట ఈరోజు విడుదల చేస్తోంది చిత్రబృందం. దేవి అనగానే ఫాస్ట్ బీట్లు ఆశిస్తాం. తొలి పాటగా ఆయన్నుంచి వస్తోంది మాత్రం కాస్త స్లో సాంగ్ అని సమాచారం. ఐటెమ్ పాట విషయంలోనూ ఈ చిత్రబృందం ఓ ప్రయోగం చేసింది. ఎక్కడైనా హీరోయిన్లు ఐటెమ్ పాటలో కనిపిస్తారు. ఇందులో మాత్రం వెంకీ, వరుణ్‌లపై ఐటెమ్ పాట డిజైన్ చేశారు. ఐటెమ్ గీతాలకు దేవి బ్రాండ్ అంబాసిడర్. మరి ఈసారి ఎలాంటి ఐటెమ్ అందించాడో చూడాలి.