శ్రీదేవి వీరాభిమానుల్లో… ఆ మాటకొస్తే అతివీర భయంకర అభిమానుల్లో అగ్రగణ్యుడు రాంగోపాల్ వర్మ. శ్రీదేవి హఠాన్మరణం ఆయన్ని బాగా కలిచివేసింది. ట్విట్టర్లలో భోరుమన్నాడు. వర్మ వేదన ఆయన అభిమానుల్ని కూడా ఇబ్బంది పెట్టింది. శ్రీదేవి మరణం చుట్టూ వివాదాలు మసురుకున్న నేపథ్యంలో శ్రీదేవి జీవిత కథపై ఆయనో సినిమా తీస్తారేమో అనుకున్నారంతా. ఇలాంటి వివాదాలు, అనుమానిత మరణాలంటే వర్మకి చాలా ఇంట్రస్టు. సినిమా తీస్తాడా, లేదా అనేది పక్కన పెడితే.. ప్రకటన మాత్రం టంచనుగా వచ్చేస్తుంది. శ్రీదేవి పై కూడా అలాంటి బయోపిక్ ఆశించారంతా.
కానీ.. వర్మ రివర్స్ అయ్యాడు. శ్రీదేవి బయోపిక్ తీయలేను అని తేల్చేశాడు. శ్రీదేవి ని రిప్లేస్ చేసే కథానాయికని తీసుకురాలేను అని చేతులెత్తేశాడు. శ్రీదేవిని భర్తీ చేసే కథానాయిక దొరకడం కష్టమే. వర్మ లాజిక్ అర్థం చేసుకోదగినదే. కానీ వర్మ ఇప్పటి వరకూ ప్రకటించిన బయోపిక్లకూ ఇదే సూత్రం వర్తిస్తుంది కదా? ఎన్టీఆర్‌పై ఓ సినిమా తీస్తానని చెప్పాడు వర్మ. పోస్టర్కూడా బయటకు వచ్చింది. అంటే.. ఎన్టీఆర్‌ని రిప్లేస్ చేసే నటుడ్ని ఆయన పట్టుకున్నట్టేనా..?? శ్రీదేవి స్థానాన్ని ఎలా భర్తీ చేయలేమో.. ఎన్టీఆర్ కూడా అంతే కదా..! శ్రీదేవిపై ఉన్న అభిమానంతో వర్మ అలా అంటున్నాడేమో గానీ… ఏ నటుడ్నీ, ఏ నటినీ ఎవ్వరూ రిప్లేస్ చేయలేరు. కిల్లింగ్ వీరప్పన్ సినిమా కోసం వీరప్పన్ని పోలిన నటుడ్ని వెదికిపట్టుకొచ్చాడు వర్మ. ఆ నటుడిలో వీరప్పన్ పోలికలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. వర్మ అనుకుంటే.. శ్రీదేవిని పోలిన మరో అమ్మాయిని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే.. శ్రీదేవిపై ఆయనకున్న పిచ్చి.. అంత సాహసానికి ఒడిగట్టనివ్వకుండా అడ్డుపడుతోంది. శ్రీదేవిని చూసిన కళ్లతో.. మరెవ్వరూ శ్రీదేవిలా కనిపించరు. వర్మ సమస్య అదే.