రేవంత్ రెడ్డి ఉదంతంపై తను వచ్చే వరకూ ఎవరూ మాట్లాడవద్దని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అయినా మాట్లాడితే ఆగ్రహించారు. వచ్చాక హైదరాబాదులో సమావేశం జరిపి ఆ పైన అమరావతికి రప్పించారు. తీరా అక్కడ మాట్లాడింది లేకపోగా ఆయన తన సహాయకుడికి రాజీనామా లేఖ ఇచ్చి వెళ్లే అవకాశమిచ్చారు. అదెలా జరిగింది, కావాలనే మాట్లాడలేదా లేక ఇబ్బంది లేకుండా దాటేశారా అనే దానిపై చాలా కథనాలున్నాయి. ఆ సమయంలో ఉద్వేగం గురించి , తర్వాత టిటిడిపి సమావేశంలో రేవంత్‌కు అనుకూల ప్రసంగాల గురించి కథనాలు వచ్చాయి గాని నిజం కాదని తేలింది. ఎందుకంటే అక్కడ అలా మాట్లాడారని చెప్పిన వారే టిఆర్ఎస్లో చేరుతున్నారు. ఇక పోతే చంద్రబాబు తనకు ఎదురైన రేవంత్‌కు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని ఆయన వ్యతిరేకులు చెబుతున్నారు.ఏది ఏమైనా రాజీనామా తర్వాత ఇంతవరకూ చంద్రబాబు నోట రేవంత్ అన్న పేరే వినిపించలేదు. విమర్శలూ లేవు.పరోక్షంగానైనా ఆయన గురించి సూటిగా చెప్పడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? చాలా సాధారణ భాషలో అటూ ఇటూ తిప్పి మాట్లాడ్డం తప్ప కనీసం పేరు లేకుండా జరిగిన పరిణామాలనూ తను అనుసరించిన విధానాన్ని వివరించాల్సిన బాధ్యత లేదా? బాలయోగి ఎర్రం నాయుడు వంటి వారు ప్రమాదంలో మరణించడానికి తను అమితంగా ఆదరించిన నాయకుడు రాజీనామా విసిరి వెళ్లిపోవడానికి పోలిక ఏమిటి?
ఇక పోతే ఆయన రాజీనామా లేఖ చంద్రబాబుకు ఇచ్చినట్టు చెబుతున్నారు. అది నిజమా కాదా? నిజమైతే ఇంతవరకూ ఎందుకు పంపించలేదు? తెలంగాణ వరకూ టిడిపి వైఖరిని బట్టి రాజీనామా చేయడం సరైందే కదా? అంటే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకోసం రేవంత్‌కు అవకాశం ఇస్తున్నారా? అధికారికంగా వివరణ లేదు.
రాష్ట్ర విభజన తర్వాత మొదటి ఏడాది చంద్రబాబు తెలంగాణ నాయకులకే ఎక్కువ సమయం ఇచ్చేవారు. వారి సిఫార్సులే అమలవుతాయని ఎపి నాయకులు వాపోతుండేవారు. తర్వాత అది మారింది. జిహెచ్ఎంసితో పూర్తిగా తలకిందులైంది. ఇప్పుడు మళ్లీ పాత పరిస్థితులు వస్తాయని టిటిడిపి నేతలు ఆశిస్తున్నారు. చంద్రబాబు నివాసం,వ్యవసాయ క్షేత్రం, హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్టు మాత్రమే గాక జిల్లాలలోనూ కార్యాలయాలు వున్న తెలుగుదేశం నేతలు వాటిని వదలిపెడతారని భావించలేము.కాపాడుకోవాలంటే టిఆర్ఎస్ ప్రభుత్వంతో రాజీ పడాల్సిందేనని చంద్రబాబు పరోక్షంగా అంగీకరిస్తున్నారు. కాస్త స్థిరపడిన టిడిపి సీనియర్లుకూడా ఈ వయసులో పార్టీ ఏం మారతామని చెబుతున్నారు. వీలైతే బిజెపిని పట్టుకుని పదవులు లేదంటే ఎపిలో పార్టీకోసం బాధ్యతలు తీసుకోవాలని చూస్తున్నారు. మోత్కుపల్లి వంటి వారు రాజ్యసభ గవర్నర్ వంటివిఆశిస్తున్నారు. ఇవన్నీ చంద్రబాబు ఏం చేస్తారో ఏలా చేస్తారో చూడాలి