ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పొత్తుల్లేవని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి.. రాహుల్ గాంధీతో చర్చలు జరిపిన వచ్చిన మరుసటి రోజే.. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా..ఒంటరిగా పోటీ చేస్తున్నామని ప్రకటించింది. విజయవాడలో ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో పొత్తులపై సుదీర్ఘంగా చర్చిచారు. టీడీపీతో అవగాహన జాతీయ రాజకీయాలకే పరిమితం కావాలని నిర్ణయించారు.
రాష్ట్రస్థాయిలో పొత్తులు ఉండవని హైకమాండ్ నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయని.. కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. పొత్తులు లేకుండానే 175 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు.
ప్రత్యేక హోదా, విభజన హామీలపై రాహుల్‌గాంధీ ప్రకటనతో…కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెరిగిందని కాంగ్రెస్ నేతలు అంచనాకు వచ్చారు.
175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్ ఊమెన్‌చాందీ ప్రకటించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల కమిటీలపై హైకమాండ్‌కు ఈవారంలోనే నివేదిక పంపుతామని.. రాహుల్‌గాంధీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. ఎన్నికల వ్యూహంపై ఈనెల 31న మరోసారి చర్చిస్తామని ..ఫిబ్రవరిలో 13 జిల్లాల్లో బస్సుయాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కూటమి కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
అయితే చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు.. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడానికి సిద్ధపడలేదు. రాష్ట్ర స్థాయిలో విడివిడిగా పోటీ చేస్తూ… ఢిల్లీలో మాత్రం.. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలని నిర్ణయించారు. ఆ వ్యూహమే.. ఏపీలోనూ అమలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసినప్పటికీ… ఫలితాలు అనుకూలంగా రాలేదు. ఒక వేళ తెలంగాణ ప్రయోగం విజయవంతం అయి ఉంటే… ఏపీలోనూ.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ సుముఖంగా ఉండేది. కానీ.. అక్కడ ఓటమి ప్రభావం ఏపీ లో పొత్తులపై పడింది.