అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టులో ఈ రోజు జరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ రోజు విచారణ జాబితాలో ఈ కేసు లేదు. ఒక సారి నోటీసు అయిన కేసులను బుధ, గురువారాల్లో విచారణ చేయవద్దని సుప్రీంకోర్టు ఈ నెల 14న సర్క్యూలర్ జారీ చేసింది. ఈ కారణంగా అమరావతి కేసు విచారణ జరిగే అవకాశాల్లేవని సుప్రీంకోర్టు లాయర్లు అంచనా వేస్తున్నారు.
హైకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి అత్యవసరంగా స్టే కోసం ప్రభుత్వం అదే పనిగా ప్రయత్నిస్తోంది. వైసీపీ ఎంపీ, లాయర్ నిరంజన్ రెడ్డి ఈ విషయంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన గతంలో అమరావతి కేసును అత్యవసరంగా విచారించాలంటూ బెంచ్ ముందు ప్రస్తావించారు. 23వ తేదీన తొలి కేసుగా విచారిస్తామని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్నలతో కూడిన ధర్మాసనం తెలిపింది. కానీ ఇప్పుడు ఆ కేసు విచారణకు రావడం లేదు. ఇటీవల నిరంజన్ రెడ్డి వ్యవహారం సుప్రీంకోర్టులో చర్చనీయాంశంగా మారింది. జగన్ కు సంబంధించిన కేసుల బెంచ్ హంటింగ్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
అమరావతి కేసులో మళ్లీ ఎప్పుడు విచారణ జరుగుతుందో స్పష్టత లేదు. కేంద్రం కూడా అమరావతి అంశంపై కౌంటర్ దాఖలు చేసింది. గత ప్రభుత్వం అమరావతిని చట్ట బద్ధంగా ఏర్పాటు చేసినట్లుగా స్పష్టం చేసింది. అలాగే రైతులు.. ఇతరులు కూడా తమ కౌంటర్లను దాఖలు చేశారు. వాటిపై సుప్రీంకోర్టు విచారణ జరపాల్సి ఉంది. ఇప్పటికే ఓ సారి విచారణ జరిపి.. రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాణాలు చేయాలన్న ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.