జమ్మూకశ్మీర్‌ను రెండుగా విభజించి.. లద్ధాఖ్, జమ్మూలను ఏర్పాటు చేసిన సందర్బంగా.. కేంద్ర ప్రభుత్వం ఇండియా కొత్త మ్యాప్‌ను అధికారికంగా విడుదల చేసింది. అందులో అన్ని రాష్ట్రాలను.. వాటి రాజధానులను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ను గుర్తించారు కానీ.. ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిని మాత్రం గుర్తించలేదు. ఏపీకి రాజధాని లేనట్లుగా అలా వదిలేశారు. మ్యాప్‌లో ఇందులో 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాజధానిని చేర్చిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీ రాజధాని అమరావతిని మాత్రం చేర్చలేదు. దీనిపై.. సోషల్ మీడియా ఒక్క సారిగా భగ్గుమంది. ఏపీకి ఎందుకీ దుస్థితి అనే చర్చలు కూడా ప్రారంభమయ్యాయి.
అయితే.. ఈ మ్యాప్ విషయంలో.. బహిరంగంగా ఏ రాజకీయ పార్టీ కూడా.. విమర్శలు చేసుకోలేదు. కానీ.. మొదటగా.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ.. తెర ముందుకు వచ్చి.. మ్యాప్‌లో.. ఏపీ రాజధాని అమరావతిని గుర్తించకపోవడానికి చంద్రబాబుకే కారణం అంటూ.. తనదైన శైలిలో విమర్శలు చేస్తూ.. ట్వీట్ చేశారు. దీంతో.. అమరావతి కేంద్రంగా మరోసారి రాజకీయం ప్రారంభమయింది. మ్యాప్ సిద్ధం చేసేది కేంద్ర ప్రభుత్వం అయితే.. కన్నా లక్ష్మినారాయణ చంద్రబాబును తిడుతున్నారేమిటా.. అన్న సందేహం అందరికీ వచ్చింది. అయితే.. కన్నా… వివాదం ప్రారంభమవక ముందే.. రివర్స్ రాజకీయం చేస్తున్నారనే అభిప్రాయానికి చాలా మందికి వచ్చారు.
అయితే.. అసలు మ్యాప్‌లో ఎందుకు అమరావతిని గుర్తించలేదన్న దానిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్లుగా కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామంటూ.. చెప్పుకొచ్చినట్లుగా ఢిల్లీ వర్గాలు చెప్పాయి. దానికి తగ్గట్లుగా ఏపీ మంత్రులు కూడా.. అమరావతిపై రకరకాల విమర్శలు చేశారు. దీంతో.. బీజేపీ అధికార ప్రతినిధి హోదాలో.. జీవీఎల్ కూడా.. అమరావతి మారబోతున్నట్లు తమకు సమాచారం ఉందని ప్రకటించేశారు. వీటన్నింటినీ ఫలితమే.. దేశ అధికారిక మ్యాప్‌లో ఏపీ రాజధానికి గుర్తింపు లేకపోవడం అని అంటున్నారు.
మరో వైపు వైసీపీ , బీజేపీ నేతలు మాత్రం అంతర్గతంగా మరో భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. పదేళ్ల పాటు… ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను చట్టంలో పేర్కొన్న తర్వాత.. ఏపీకి ప్రత్యేక రాజధానిగా ఎలా గుర్తింపు నిస్తారని అంటున్నారు. రాజధానిగా అమరావతిని గుర్తించి ప్రధాని శంకుస్థాపన చేసినప్పటికీ.. అధికారికంగా గెజిట్ లేదని.. వైసీపీ నేతలు ఇప్పటికే వాదనలు ప్రారంభించారు.