సింగపూర్‌లో పర్యటిస్తున్న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన.. అక్కడి మీడియా సమావేశాల్లో.. ఇతర పెట్టుబడిదారుల సమావేశాల్లో.. అమరావతి నిర్మాణం లేనట్లేనని చెబుతున్నారు. అమరావతి నిర్మాణానికి తమ వద్ద నిధుల్లేవని.. అందుకే.. ఇప్పుడల్లా.. అమరావతి నిర్మాణం జరగదని.. అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని.. ఆయన అడిగిన వారికీ.. అడగని వారికీ… సింగపూర్‌లో చెబుతున్నారు. ఇతర రంగాల్లో పరిశ్రమలను ఏపీకి అహ్వానిస్తమని చెబుతున్నారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వంతో కూడిన కన్సార్షియంతో చేసుకున్న ఒప్పందం ఇక ముందుకు సాగని.. బుగ్గన పరోక్షంగానే తేల్చి చెప్పినట్లయింది.
భారత్ – సింగపూర్ బిజినెస్ ఇన్నోవేషన్ సదస్సుకు హాజరైన బుగ్గన నేతృత్వంలోని ఏపీ బృందం.. అమరావతి వైపు రావాల్సిన అవసరం లేదన్నట్లుగా.. సింగపూర్‌కు మెసెజ్ పంపింది. ఈ విషయంపై.. సింగపూర్ కూడా.. అందే స్పందించింది. అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. అయితే.. త్వరగా అధికారికంగా నిర్ణయాన్ని తెలియాచేయాలన్నట్లుగా… సింగపూర్ విదేశాంగ మంత్రి బాలకృష్ణన్… సదస్సులో మాట్లాడారు. అమరావతిలో పెట్టుబడి పెట్టిన.. పెడుతున్న వారికి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్నారు. అప్పుడే… పెట్టుబడిదారులు..ఆయా ప్రాజెక్టుల్లో ఉండాలో.. వెళ్లిపోవాలో నిర్ణయించుకుంటారన్నారు.
ప్రభుత్వానికి అమరావతి విషయంలో… ఓ స్పష్టమైన విధానం ఉందో లేదో కానీ.. చెప్పడానికి మాత్రం సంకోచిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వమే ఏదో విధానాన్ని తెరపైకి తెస్తుంది కానీ… అసలు విషయాన్ని మాత్రం వెల్లడించడం లేదు. పెట్టుబడులు పెడుతున్న వారి వద్దకు వెళ్లి… నిరాశాజనకమైన ప్రకటనలు చేస్తోంది. ఫలితంగా.. అమరావతి నిర్మాణాన్ని ఇప్పటికైతే నిలిపివేసినట్లే.. సింగపూర్ సంస్థలు ఓ అంచనాకు వచ్చాయి. అవన్నీ.. అమరావతి నుంచి వైదొలగడానికి సిద్ధమవుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వమే దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.