సావిత్రి, ఎన్టీఆర్ బయోపిక్‌లానే… ‘ఏఎన్నార్’ బయోపిక్ రాబోతోందని, నాగార్జున ఆ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారని టాలీవుడ్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై నాగార్జున క్లారిటీ ఇచ్చారు. బయోపిక్ చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. ”నాన్నగారి జీవితం చాలా సుఖంగా సాగిపోయింది. అన్నీ ఎత్తులే. పల్లాల్లేవు. సినిమాకి సరిపడా డ్రామా ఆ కథలో లేదు. ఈ సినిమాతో కొత్తగా ఏం చెప్పలేం. అందుకే ఆ కథ సినిమాగా పనికిరాదు. ఎవరైనా నాన్నగారి బయెపిక్ తీస్తానని ముందుకొస్తే.. ‘ఏముందని తీస్తారు’ అని అడుగుతాను. నాన్నగారి కథని సినిమాగా తీయలేం గానీ, పుస్తకంగా వస్తే బాగుంటుంది” అన్నారు నాగ్. పనిలో పనిగా `మహానటి` బయోపిక్ గురించి ప్రస్తావించారు. ”మహానటి చూశా. చాలా బాగుంది. నాన్నగారి పాత్రలో చైని చూస్తే ముచ్చటేసింది. నాన్నగారిలా ఉన్నాడని కాదు, ఎందుకో ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యా” అన్నాడు నాగ్. సో.. ఏఎఎన్నార్ బయోపిక్‌పై వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలే అన్నమాట.