మంత్రివర్గ కూర్పు అంశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తి కసరత్తు నిర్వహిస్తున్నారు. పార్టీపట్ల అంకిత భావం, తన పట్ల విధేయత ఉన్నవారికే పెద్దపీఠ వేయాలని నిర్ణయించారు. సామాజిక సమీకరణాలను కూడా సరిచూసుకుని ముందుకెళ్లాలని భావిస్తున్నారు. తనను ప్రభావితం చేసేందుకు, విజ్ఞప్తులు ఇచ్చేందుకు వచ్చే వారికి అపాయింట్మెంట్లు కూడా నిరాకరిస్తున్నారు.
పార్టీ నేతలకు జగన్ అపాయింట్మెంట్లు లేనట్లే..!
ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ ఏర్పాటుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. ఒకవైపు శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తూనే మరోవైపు మంత్రివర్గ ఏర్పాటుపై కసరత్తు నిర్వహిస్తున్నారు. పార్టీకి చెందిన ఒకరిద్దరు అంతరంగికులతో మినహా మరెవ్వరితోనూ మంత్రివర్గ కూర్పుపై జగన్ మాట్లాడటం లేదు. పార్టీ సీనియర్ నేతలు కూడా ఈ అంశాన్ని అధినేత వద్ద ప్రస్తావించట్లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాయంత్రం కొంతమంది పార్టీ నేతలను జగన్ కలుసుకున్నారు. ఆ తర్వాత శుక్ర, శనివారాల్లో జగన్ ఎవరికీ అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. ప్రజాప్రతినిధులు అనేకమంది జగన్ ను కలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అధికారిక సమావేశాలు ఉండటంతో సాధ్యం కాలేదు. శనివారం కొంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినప్పటికీ, భద్రతా సిబ్బంది పొలిటికల్ అపాయింట్మెంట్లు లేవంటూ వెనక్కి పంపారు.
మంత్రి పదవుల ఆశావహులకు నో ఎంట్రీ…!
జూన్ 8వ తేదీన మంత్రివర్గం ఏర్పాటు జరుగుతుందని అధికారికంగా ప్రకటించటం, అదేరోజు జగన్ సచివాలయ ప్రవేశం కూడా ఉండటంతో మంత్రివర్గంలో ఎంతమందికి అవకాశం కల్పిస్తారనే అంశంపై చర్చ జరుగుతోంది. జిల్లాకు ఒకరు చొప్పున 13 మందిని లేదా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకారం 24 మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనే అంశంపై పార్టీ వర్గాలకు ఇంకా స్పష్టత రాలేదు. ఈ అంశంపై పార్టీ వర్గాల్లో కూడా తర్జనభర్జనలు జరుగుతున్నాయి. నవరత్నాల హామీల అమలు, ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్ దృష్టిసారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటి అమలుకు సంబంధించి జిల్లాస్థాయిలో అధికార యంత్రాంగంతోపాటు రాజకీయ పరమైన పర్యవేక్షణ కూడా ఉండాలని పార్టీ నేతలంటున్నారు. అందువల్లే పూర్తిస్థాయి రాష్ట్ర కేబినెట్ ఉంటుందని వారు భావిస్తున్నారు. సామాజిక వర్గాల సమీకరణ, అంకిత భావం, విధేయత వంటి అంశాలను జగన్ పరిగణనలోకి తీసుకుంటారని చెబుతున్నారు.
కొన్నాళ్లు అధికార విధుల్లో బిజీ..! పార్టీకి టైం లేనట్లే..!
వైసీపీఎల్పీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం రోజు మళ్లీ హాజరయ్యారు. ఆ తర్వాత పలువురు అపాయింట్మెంట్లు కోరినప్పటికీ సీఎం కార్యాలయం తిరస్కరించింది. అధికార యంత్రాంగంతో వివిధ శాఖలపై సీఎం జగన్ సమీక్షలు నిర్వహిస్తుండటంతో కొన్ని రోజులు ఎవర్నీ కలవరని స్పష్టం చేశారు. సోమవారం నుంచి సమయాన్నిబట్టి ఆయన పార్టీ నేతలను కలుసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం కూడా సమీక్షలు ఉండటంతో సాయంత్రం తర్వాతే జగన్.. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను కలుసుకునే అవకాశం ఉంటుంది. జగన్ ను కలిసి మంత్రి పదవుల కోసం అడగాలని కొంతమంది నేతలు భావిస్తున్నప్పటికీ జగన్ ఆ అవకాశం ఇవ్వరనే చర్చ జరుగుతోంది.