తెలంగాణా ప్రభుత్వ సాగునీటి సలహాదారు విద్యాసాగర్ రావు చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “సాగునీటి ప్రాజెక్టులకి అన్ని రకాల అనుమతులు వచ్చిన తరువాతనే పనులు ప్రారంభించాలనే ఆలోచన సరికాదు. ప్రాజెక్టులపై సమగ్ర నివేదికలు, అనుమతులు సిద్దం కాకపోయినా ప్రభుత్వాలు తమ లక్ష్యాలకి అనుగుణంగా ముందుకు సాగడమే మంచిదన్న మాజీ ముఖ్యమంత్రి సర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆలోచనే విధానమే సరైనదని నేను ఇప్పుడు గ్రహించాను. ఆయన హయంలో మొదలుపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులకి అనుమతులు లేవని నేను అభ్యంతరం చెప్పినప్పుడు, ‘ప్రజల అవసరాలని, ప్రభుత్వ లక్ష్యాలని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ముందుకు సాగడమే మంచిదని, ఎగువనున్న మహారాష్ట్ర అదే విధానం అవలంభిస్తున్నప్పుడు మనం మాత్రం ఆవిధంగా ఎందుకు చేయకూడదు? అనుమతుల కోసం కూర్చొంటే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుంది. కనుక ముందు పనులు ప్రారంభించి ఆ తరువాత అనుమతులు సాధించుకోవచ్చు. అయినా ఒక ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ దాని హయంలోనే పూర్తయిపోవు కదా?’ అని ఆయన అన్నప్పుడు నేను ఆయనతో ఏకీభవించలేక పోయాను. కానీ ఇప్పుడు ఆయన చెప్పిందే సరైనదని అర్ధం అయ్యింది,” అని చెప్పారు.
విద్యాసాగర్ రావు అంతటితో ఆగితే ఇబ్బందేమీ ఉండేది కాదు. కానీ ఆయన తెలంగాణా ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పధకాలకి కూడా ఎటువంటి అనుమతులులేవని వాటికి కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) కూడా లేవని చెప్పడమే తెలంగాణా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. వాటికి ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి చెప్పినట్లుగా ప్రస్తుత పరిస్థితులలో వాటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడమే తెలంగాణా ప్రభుత్వానికి మంచిదని విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. అనుమతులు లేవని, ప్రాజెక్టులలో ఏవో చిన్న చిన్న లోపాలున్నాయనే సాకుతో రాష్ట్రంలో ప్రతిపక్షాలు, రాజకీయ ఉద్దేశ్యాలతో కొన్ని మీడియా సంస్థలు వాటిని అడ్డుకోవడం తగదని ఆయన హితవు పలికారు. ప్రొఫెసర్ కోదండరాం, వి.హనుమంత రావు వంటి అచ్చమైన తెలంగాణా నేతలు కూడా తెలంగాణా ప్రాజెక్టులని అడ్డుకోవడం శోచనీయమని అన్నారు. ఆ ప్రాజెక్టుల గురించి తెలిసీ తెలియకుండా ఏదేదో మాట్లాడేసి ప్రజలని గందరగోళ పరచవద్దని విద్యాసాగర్ రావు కోరారు.
తెలంగాణా ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టులకి ఎటువంటి అనుమతులు లేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. వాటికి సమైక్యరాష్ట్రంగా ఉన్నప్పుడే అన్ని అనుమతులు వచ్చేశాయని తెలంగాణా ప్రభుత్వం వాదిస్తోంది. కానీ ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వ సాగునీటి సలహాదారు విద్యాసాగర్ రావు స్వయంగా ఆంధ్రప్రదేశ్ వాదనలని ద్రువీకరిస్తున్నట్లు ఈవిధంగా మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకు ఆయనపై తెలంగాణా ప్రభుత్వం వేటు వేస్తుందేమో?