ఒక నాయకుడు పార్టీ మారాడంటే… ఏదో ఒక ప్రయోజనం కచ్చితంగా ఉంటుంది కదా! మరీ ముఖ్యంగా కేంద్రంలో అధికార పార్టీలో చేరేవారే ఏమీ ఆశించరూ, వారికి పార్టీ ఏమీ చెయ్యదు అని వ్యాఖ్యానిస్తే ఎలా ఉంటుంది..? ఇలాంటి మాటలే చెబుతున్నారు భాజపా జాతీయ కార్యదర్శి మురళీధరరావు. భాజపాలో చేరితే కేసుల నుంచి విముక్తి కలుగుతుందనే భ్రమలు ఎవ్వరూ పెట్టుకోవద్దనీ, అలాంటి ఆశతో పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తే అది వృథా ప్రయాసే అవుతుందన్నారు. ఆదాయ పన్ను శాఖ దాడులకు, ఈడీ చేసే దాడులకూ భాజపాకీ ఎలాంటి సంబంధం లేదనీ, ఎవరిపని వారిదేననీ, చట్టం తన పనితాను చేసుకెళ్తుంటే మధ్యలో తాము ఎన్నడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు.
కర్ణాటకలో తాను పార్టీ ఇన్ ఛార్జ్ గా పనిచేస్తున్నాననీ, అక్కడ భాజపా నాయకులపై జరిగిన ఐటీ దాడులు చూస్తే పార్టీ వ్యవహార శైలి ఎంత నిక్కచ్చీగా ఉంటుందో అర్థమౌతోందన్నారు మురళీధరరావు. గత నాలుగేళ్లలో భాజపా నేతల ఇళ్లలో ఆఫీసుల్లో ఐటీ రైడ్లు ఎక్కువగా జరిగాయనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయన్నారు. కాబట్టి, ప్రభుత్వ యంత్రాంగం చేసే పనికి రాజకీయాన్ని ఆపాదించొద్దన్నారు. పార్టీలకూ వర్గాలకూ అతీతంగా నడుస్తున్న పనులు అవి అన్నారు. చట్టానికీ రాజకీయానికీ సంబంధం లేదనీ, మా పార్టీలో చేరితే ఏదో రక్షణ లభిస్తుందనుకుని వస్తే అంతకుమించిన ఆశాభంగం మరొకటి ఉండదన్నారు.
సరే, ఆయన ఒక్క కర్ణాటక ఉదాహరణ మాత్రమే చెప్పారు. పక్క రాష్ట్రం ఆంధ్రా సంగతి చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఎంపీలుగా ఉండగా సుజనా చౌదరి, సీఎం రమేష్ ల ఇళ్లపైనా ఆఫీసులుపైనా వరుస ఐటీ, ఈడీ దాడులు ఎడాపెడా జరిగాయి. ఓదశలో టీడీపీ కూడా ఈ నాయకుల్ని వెనకేసుకొస్తూ కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు చేసింది. ఆ తరువాత ఏమైందీ… టీడీపీ రాజ్యసభ ఎంపీలు భాజపాలో చేరిపోయారు. కండువా మార్చగానే అంతా కామ్ అయిపోయిందిగా! ఐటీ దాడుల్లేవ్, ఇళ్లలో ఆఫీసుల్లో సోదాల్లేవ్! అదేంటో మరి… ఆ నాయకులు కండువా మార్చగానే రాజకీయంతో ఏమాత్రం సంబంధం చట్టం తన పనిని ఆపేసిట్టుగా కనిపించింది. ఈ పరిస్థితిని మురళీధరరావు విశ్లేషించి ఉంటే బాగుండేది. పొరుగు రాష్ట్రం తమిళనాడులో… కరుణానిధిని స్నేహపూర్వకంగా కలిసేందుకు ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లారు గుర్తుందా..? అదేంటో, ఆ సమయంలోనే కనిమొళి, రాజాలు దేశాన్నే కుదిపేసిన 2 జీ స్పెక్ట్రమ్ కేసు నుంచి విముక్తి పొందారు. ఇవన్నీ యాదృచ్చికమా..?