ఎందుకో గానీ, సినిమా వాళ్లంటే అటు ఏపీ ప్రభుత్వానికీ, ఇటు తెలంగాణ ప్రభుత్వానికీ చిన్న చూపు అయిపోయింది. సినిమావాళ్లని పట్టించుకోవడమే మానేశారు. ఆనవాయితీగా ఇచ్చే అవార్డుల్ని ఎప్పుడో గంగకు వదిలేశారు. ఐదారేళ్లుగా అవార్డుల ఊసే లేదు. ఏపీ ప్రభుత్వం నంది ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం `సింహా` పేరుతో అవార్డుల్ని ప్రకటించింది కానీ, ఒక్కసారి కూడా ఇవ్వలేదు. అన్ని అవార్డుల్నీ కలిపి.. ఒకేసారి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ.. అది కుదరదని తేలిపోయింది.
ఈమధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గర సినిమావాళ్ల అవార్డుల ప్రస్తావన వస్తే.. `ఇప్పుడెందుకు అవన్నీ… అనవసరమైన రాద్ధాంతం` అంటూ కొట్టిపడేశార్ట. ఇక… జగన్ గురించి చెప్పేదేముంది? తెలుగు సినిమాని వైజాగ్ షిఫ్ట్ చేయాలన్న ఆలోచనే ఆయనకు లేదు. సినిమా అంటే హైదరాబాద్ కే పరిమితమైన వ్యవహారం అనుకొంటున్నారు. టికెట్ రేట్ల విషయంలో ప్రేక్షకుల్నీ, సినిమా వాళ్లనీ ఎంత గందరగోళానికి గురి చేశారో చెప్పక్కర్లెద్దు. అలాంటి జగన్ ప్రభుత్వం అవార్డుల్ని ఇస్తుందనుకోవడం భ్రమే.
అయితే.. ఇప్పుడు టీఎఫ్‌సీసీ.. నంది పేరుతో అవార్డుల్ని ఇవ్వాలని నిర్ణయించుకొంది. ఇది ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కాదు. ప్రైవేటు అవార్డులే అనుకోవాలి. చిత్రసీమే పూనుకొని అవార్డులు ఇవ్వడం మంచిదే. కాకపోతే ఈ అవార్డుల్లో ఎంత పారదర్శకత ఉంటుందో చెప్పలేం. ప్రభుత్వం ఇచ్చే అవార్డులకు ఇచ్చే క్రేజ్ వీటికి ఉంటుందా అనేది అనుమానమే. పైగా తెలంగాణ, ఏపీ అంటూ విడదీసి చూస్తే.. ఆ వైభవం ఇంకా తగ్గుతుంది. త్వరలోనే దుబాయ్‌లో ఈ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. కనీసం ఇప్పటికైనా ఏపీ నుంచి ఇలాంటి ప్రైవేటు అవార్డుల ప్రకటన ఏదైనా వస్తుందేమో చూడాలి.