విదేశాల్లో భారత అక్రమార్కులు దాచుకున్న నల్లడబ్బును.. వంద రోజుల్లో వెనక్కి తెస్తామని.. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీ.. విపరీతంగా ప్రచారం చేశారు. అంతే కాదు.. ఆ వంద రోజుల్లోనే విదేశాల్లో ఉన్న నల్లడబ్బును వెనక్కి తెస్తే.. ఒక్కొక్క భారతీయుని ఖాతాలో రూ. 15 లక్షలు పడతాయని కూడా ప్రచారం చేశారు. ఈ దెబ్బతో వారికి ఓట్ల వర్షం కురిసింది. కానీ బ్లాక్మనీ గురించి ఆశలు పెట్టుకున్న భారతీయులకు నిరాశే మిగిలింది. వంద రోజుల చాలెంజ్ గురించి అడిగితే.. అమిత్ షా “జుమ్లా” అనేశారు. నోట్ల రద్దుతో ఒక్క రూపాయి బ్లాక్ మనీ బయటకు రాలేదు కానీ… అమిత్ షా అండ్ కో.. మాత్రం వేల కోట్ల నగదును మాత్రం.. వైట్ గా చేసుకున్నట్లు అనేక ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎలాంటి విచారణా లేదు.
ఇప్పుడు భారతీయులు స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్న సొమ్ము అపరిమితంగా పెరిగిపోతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 7వేల కోట్లు.. స్విస్ బ్యాంకులకు తరలి పోయాయని..తాజాగా లెక్కలు బయటకు వచ్చాయి. దీనిపై బీజేపీపై విపక్షాలు విమర్శలు ప్రారభించాయి. దీంతో ప్రస్తుతం.. ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న పీయూష్ గోయల్, శాఖలేని మంత్రిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న అరుణ్ జైట్లీ.. వేర్వేరుగా… రూల్స్ చెప్పడం ప్రారంభించారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న ధనమంతా నల్లధనం కాదని పీయూష్ గోయల్ సూత్రీకరించారు. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా అరుణ్ జైట్లీ ప్రాథమిక నిబంధనలు తెలుసుకోవాలంటూ.. రాహుల్ గాంధీకి సూచనలు చేశారు. మరి వీరు చెప్పే సూక్తులు.. గత ఎన్నికల ముందు… ప్రచారంలో ఎందుకు గుర్తుకు రాలేదో మరి..!
ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయంలో బ్లాక్ మనీ జుమ్లాపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతూండటంతో ఇప్పుడు కొత్తగా వచ్చే ఏడాది నల్ల కుబేరుల జాబితా విడుదల చేస్తామంటూ కేంద్రం ప్రకటనలు చేస్తోంది. స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో చర్చలు జరిగాయని.. ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా అక్కడి సర్కార్ బ్లాక్ మనీ హోల్డర్స్ లిస్ట్ ఇచ్చేందుకు అంగీకరించిందని పీయూష్ గోయల్ చెప్పుకొస్తున్నారు. వంద రోజుల్లో అంటూ..మోడీ చేసిన ప్రచారం చెవుల్లో మార్మోగుతూండగానే.. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు వచ్చే ఏడాది అంటూ.. చెప్పుకొస్తున్నారు.
ఎన్నికల ముందు ఏదో సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలు దొంగచాటుగా రిలీజ్ చేసినట్లు..ఏదో ఫేక్ లిస్ట్ రిలీజ్ చేసి… ప్రతిపక్ష నేతల మీద బురదజల్లే ప్లాన్ ఏదో అమలు చేస్తారని..విపక్ష పార్టీలు ఇప్పటికే అనుమానిస్తున్నరు. బీజేపీ రాజకీయాలు చూసే వారికి..ఇదేం అబద్దం అనుకోవాడనికి లేదని పిస్తుంది.